ఇందూరు ఐటీ ఇంకెన్నాళ్లు?

by  |
ఇందూరు ఐటీ ఇంకెన్నాళ్లు?
X

ఐటీ రంగంలో హైదరాబాద్ క్రేజే వేరు. ఐటీలో మేటీగా దూసుకెళ్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే ఐటీని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం నిజామాబాద్, వరంగల్, కరీంనగర్‌ కేంద్రాల్లో ఐటీ టవర్స్‌ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసింది. వరంగల్‌లో ఐటీ వెళ్లూనుకుంటుండగా కరంనగర్‌లో రేపో మాపో ప్రారంభానికి సిద్ధమైంది. కానీ, నిజామాబాద్ టవర్ మాత్రం బాలరిష్టాలను దాటడం లేదు. పనుల్లో నత్తతో పోటీ పడుతుండటంతో ఇందూరు ప్రజలు అసంతృప్తిలో ఉన్నారు.

2018, ఆగస్టు 1న రూ.25 కోట్ల వ్యయంతో నిజామాబాద్ ఐటీ టవర్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అదే రోజు 11 అంతర్ రాష్ట్ర ఐటీ సంస్థలు సైతం ఒప్పందం కూడా చేసుకున్నాయి. దీంతో ఏడాదిలోగా నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన నిరుద్యోగులకు ఉపాధి ఖాయం అనుకొని సంతోషం వ్యక్తం చేశారు. కానీ, ఏడాదిన్నర గడుస్తున్నా నాలుగు అంతస్థుల స్లాబ్‌ వరకే పరిమితం కావడంతో ప్రతి ఒక్కరూ అసంతృప్తికి లోనవుతున్నారు. ఇంకా పనులు మొత్తం పూర్తి అయ్యేందుకు మరో ఏడాది పట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నది స్పష్టంగా అర్థం అవుతోంది. దీంతో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్‌ పరిశ్రమల స్థాపనకు చేసుకున్న ఒప్పందాలు ఎప్పుడు పూర్తయి, కొత్త ఆవిష్కరణ ఇంక్యుబేషన్‌లను ఎప్పుడు ఏర్పాటు చేస్తారన్నది ప్రస్తుతం బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

హైదరాబాద్ తరువాత ఇంక్యుబేషన్ కేవలం నిజామాబాద్‌లోనే ఉంటుందని మంత్రి కేటీఆర్ హామీ ఇవ్వడంతో ఇందూరు ఐటీ రంగంలో కొత్త పరిశోధనలకు కేరాఫ్‌‌గా నిలుస్తుందని ఆశించినవారి ఆశలు అడియాసలయ్యాయి. సాఫ్ట్‌వేర్ చదువులు చదివిన యువతులు వివాహమైన తర్వాత ఉద్యోగాలను వీడకుండా వారి సొంతూళ్లలో ఉండి ఉద్యోగాలు చేసుకునేందుకు ఉపయోగపడే ఐటీ టవర్ పనులు పూర్తికాకపోవడంతో అసంతృప్తికి గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర జిల్లాల్లో ఎంసీఏ, ఎంబీఏ, ఎంఎస్ చదివినవారు హైదరాబాద్‌ వరకు వెళ్లకుండా స్థానికంగా అర్హతను బట్టి, అనుభవం ఆధారంగా వచ్చే వేతనాలకు ఐటీ టవర్‌లో పనిచేద్దామనుకునే వారు మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Next Story