భారత్‌కు అండగా మేమున్నాం : జపాన్

by  |
భారత్‌కు అండగా మేమున్నాం : జపాన్
X

దిశ, వెబ్‌డెస్క్: లద్దాక్ సరిహద్దులో యుద్ధమేఘాలు కమ్ముకున్న తరుణంలో భారత్ దౌత్యనీతి ద్వారా ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతోంది. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ దేశాలు భారత్‌కు మద్దతు ప్రకటించగా తాజాగా జపాన్ కూడా తన స్నేహ హస్తం అందించింది.ఈ మేరకు శుక్రవారం జపాన్ ఓ ప్రకటన చేసింది. ఇండియా, చైనా దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన శాంతియుతంగా పరిష్కారమవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే, వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి యధాతథ స్థితిని కొనసాగించాలని, మార్పులను సహించేది లేదని స్పష్టం చేసింది.

జూన్ 15 రాత్రి భారత జవాన్లపై చైనా సైనికులు కర్రలు, రాడ్లతో దాడి చేసి 20మంది మరణానికి కారణమైన విషయం, అనంతరం ఎల్ఏసీ వద్ద పరిణామాలపై మనదేశం జపాన్‌కు వివరించింది.శాంతియుత చర్చల అనంతరం తిరిగి వెళ్ళిపోయేందుకు సిద్ధమైన చైనా సైనికులు ఎల్ఏసీ వద్ద యధాతథ స్థితిని మార్చేందుకు ఏకపక్షంగా ప్రయత్నించారని చెప్పింది.

ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందించిన జపాన్ దౌత్యవేత్త సతోషి సుజుకి తాము భారత్‌కు అండగా నిలుస్తున్నట్లు ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. భారత దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లాతో జరిగిన సంభాషణ సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఎల్ఏసీ వెంబడి ఉన్న పరిస్థితిని విపులంగా చెప్పారన్నారు. శాంతియుత పరిష్కారం కోసం భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కూడా గుర్తుచేశారు. చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం లభించాలని జపాన్ కూడా ఆశిస్తోందని ట్వీట్‌ ద్వారా ప్రకటించారు.


Next Story

Most Viewed