కరోనాకు భారత వ్యాక్సిన్.. కోవ్యాక్సిన్

by sudharani |
కరోనాకు భారత వ్యాక్సిన్.. కోవ్యాక్సిన్
X

చికిత్స కంటే నివారణ గొప్పది.. అలాగే మందు కంటే వ్యాక్సిన్ ముఖ్యం. గత నాలుగు నెలల నుంచి ‘కరోనా’ అనే పేరు నిత్యజీవితంలో భాగమైపోయింది. ఒకప్పుడు బాగున్నావా? అని ముందు అడిగినవాళ్లందరూ ఇప్పుడేమో.. మీ దగ్గర కరోనా ఎలా ఉందని అడుగుతున్నారు. ఈ వైరస్‌కు మందు కనిపెట్టడానికి ఓ వైపు పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అదే క్రమంలో కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడంలో శాస్త్రవేత్తలు అంతే సీరియస్‌గా నిమగ్నమై ఉన్నారు. అందులో భాగంగానే భారతదేశానికి చెందిన భారత్ బయోటెక్ వారు కరోనాకు వ్యాక్సిన్ తయారు చేశారు. దానికి ‘కోవ్యాక్సిన్’ అనే పేరు కూడా పెట్టారు. ఇది ఇప్పుడు మానవ ట్రయల్స్ చేయడానికి అనుమతులు కూడా పొందడం విశేషం.

కోవ్యాక్సిన్ అంటే?

భారతదేశంలో మొదటిసారిగా తయారవుతున్న కొవిడ్ 19 వ్యాక్సిన్ క్యాండిడేట్. ఈ కోవ్యాక్సిన్‌ను క్రియాశీలకంగా లేని ‘సార్స్ కోవ్ 2 వైరస్’ మూలం నుంచి తయారు చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి భారత్ బయోటెక్ సంస్థ సంయుక్తంగా రూపొందించింది.

క్రియాశీలకంగా లేని వ్యాక్సిన్ అంటే?

వ్యాధిని కలిగించే వైరస్‌ను రసాయన లేదా భౌతిక విధానాల ద్వారా అక్రియాశీలకంగా చేసి, వాటి నుంచి ఈ క్రియాశీలకంగా లేని వ్యాక్సిన్లను తయారు చేస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం క్రియాశీలకంగా లేని వ్యాక్సిన్ల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందకపోగా, బతికి ఉన్న వైరస్‌ల మీద దాడి చేయగల వ్యాధి నిరోధకతను మానవ శరీరానికి అందిస్తాయి.

కోవ్యాక్సిన్ ఎలా తయారైంది?

పుణేలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు.. సార్స్-కోవ్-2 మూలాన్ని ఐసోలేట్ చేశారు. ఆ మూలాన్ని భారత్ బయోటెక్ సంస్థకు పంపించారు. హైద్రాబాద్‌లోని సంస్థ కంటెయిన్‌మెంట్ ఫెసిలిటీలో ఈ క్రియాశీలకంగా లేని వ్యాక్సిన్‌ను బయోటెక్ సంస్థ తయారుచేసింది. అలా తయారైన వ్యాక్సిన్‌కి సంబంధించి రక్షణ, వ్యాధినిరోధక స్పందన, ప్రీ క్లినికల్ ట్రయల్స్ ఫలితాల నివేదికలను భారత్ బయోటెక్ ఆమోదం కోసం పంపించింది. ఇప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2లో భాగంగా కోవ్యాక్సిన్‌కు మానవ ట్రయల్స్ ప్రారంభించాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చింది. జులై నెల రెండో వారంలో ఈ ట్రయల్స్ దేశవ్యాప్తంగా ప్రారంభంకానున్నాయి.

వ్యాక్సిన్ ట్రయల్ జరిగే విధానం

మానవ ట్రయల్స్ ఆమోదానికి ముందుగా ప్రీక్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి. అంటే ఈ వ్యాక్సిన్‌ను ముందుగా జంతువుల మీద పరీక్షిస్తారు. కోవ్యాక్సిన్ ఈ దశను విజయవంతంగా పూర్తి చేసింది. తర్వాత ఫేజ్ 1 ట్రయల్స్‌లో భాగంగా ఈ వ్యాక్సిన్‌ను కొంతమంది ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు ఇస్తారు. ఈ ఫేజ్ 1 ఫలితాల నివేదికలను బట్టి ఫేజ్ 2 ప్రారంభిస్తారు. ఈ ఫేజ్ 2లో వందల సంఖ్యల్లో మనుషులకు వ్యాక్సిన్ ఇస్తారు. తర్వాత ఫేజ్ 1, ఫేజ్ 2 ఫలితాలను విశ్లేషించి, సకారాత్మకమని తేలితే ఫేజ్ 3లో వేల మందికి ఇచ్చి, వైరస్ సమర్థతను, సురక్షణ గుణకాన్ని అంచనా వేస్తారు.

వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్న కంపెనీలివే!

కొవిడ్ 19 వ్యాక్సిన్ రేసులో భారత్ బయోటెక్‌తో పాటు జైడస్ కడీలా, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ సంస్థలు కూడా ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆస్ట్రాజెనెకా, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లు సంయుక్తంగా రూపొందించిన ChAdOx-S టైప్ క్యాండిడేట్ వ్యాక్సిన్ ప్రస్తుతం ఫేజ్ 3 ట్రయల్స్‌లో ఉంది.

Advertisement

Next Story