వరుసగా ఆరో నెలలో క్షీణించిన సేవల రంగం

by Harish |
వరుసగా ఆరో నెలలో క్షీణించిన సేవల రంగం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత సేవల రంగం వ్యాపార కార్యకలాపాలు ఆగష్టుకు వరుసగా ఆరో నెలలో క్షీణించాయి. కొవిడ్-19 కారణంగా విధించిన లాక్‌డౌన్ పరిమితులు సడలించడంతో కొన్ని సంస్థలు క్రమంగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాయని నెలవారీ సర్వే వెల్లడించింది.

ఐహెచ్ఎస్ మార్కిట్ సర్వీసెస్ నిర్వాహకుల సూచిక జులైలో 34.2 పాయింట్ల నుంచి ఆగష్టులో 41.8 పాయింట్లకి పెరిగింది. ఐహెచ్‌ఎస్ మార్కిట్‌ ఇండియా సర్వీసెస్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (PMI) గణాంకాల ప్రకారం.. 50 పాయింట్ల కంటే ఎక్కువ నమోదైతే వృద్ధిగానూ, 50 పాయింట్ల కంటే తక్కువైతే క్షీణతగా పరిగణిస్తారు. దేశీయ సేవల రంగంలో నిర్వహణ పరిస్థితుల్లో సవాళ్లు ఆగష్టులోనూ కొనసాగాయి.

దేశీయ, విదేశీ మార్కెట్ల పరిణామాలు, కొనసాగుతున్న లాక్‌డౌన్ పరిమితుల కారణంగా పరిశ్రమల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని ఐహెచ్ఎస్ మార్కిట్ (IHS Markit) ఆర్థికవేత్త శ్రేయా పటేల్ తెలిపారు. వివిధ ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగడంతో కొన్ని పరిశ్రమలు మూతబడ్డాయి. దీంతో ఉత్పత్తి పతనం ఆగష్టులో డిమాండ్ పరిస్థితులను మరింత బలహీనపరిచింది.

అయితే, కొన్ని సంస్థలు క్రమంగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుండటంతో ఉత్పత్తిలో సంకోచం ధృఢంగానే ఉందని శ్రేయా పటేల్ పేర్కొన్నారు. గత మూడు నెలల్లో ప్రతికూలంగా ఉన్న వ్యాపార సెంటిమెంట్ ఆగష్టులో తటస్థంగా ఉంది. అలాగే, మార్చి నుంచి వేగంగా క్షీణిస్తున్న ఉపాధి కొంత మెరుగైనట్టు సర్వే తెలిపింది. ప్రస్తుత సంవత్సరం చివరి వరకు ఉత్పత్తి స్థాయిలలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని ఐహెచ్ఎస్ మార్కిట్‌లోని మూడింట రెండొంతుల ప్యానలిస్టులు అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed