తగ్గిన డీజిల్ వినియోగం..పెరిగిన పెట్రోల్!

by Harish |   ( Updated:2020-12-01 09:14:15.0  )
తగ్గిన డీజిల్ వినియోగం..పెరిగిన పెట్రోల్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా డీజిల్ వినియోగం నవంబర్‌లో క్షీణించింది. అక్టోబర్ నెలలో కొవిడ్-19 మహమ్మారికి ముందునాటి స్థాయికి పుంజుకున్న తర్వాత డీజిల్ డిమాండ్ నవంబర్‌లో 7 శాతం తగ్గింది. అయితే, పెట్రోల్ అమ్మకాలు 5 శాతం వృద్ధిని సాధించాయని ప్రభుత్వ చమురు కంపెనీల అమ్మకాల డేటా వెల్లడించింది. అంతర్జాతీయంగా విమానాలు పరిమితంగానే కొనసాగుతుండటంతో జెట్ ఇంధన డిమాండ్ మందగించింది. నవంబర్ నెలలో ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(ఏటీఎఫ్) వినియోగం 48.4 శాతం క్షీణించింది. అదేవిధంగా గృహావసరాలకు వాడే ఎల్‌పీజీ గ్యాస్ వినియోగం 4.6 శాతం పెరిగింది.

అక్టోబర్ నెలలో డీజిల్ అమ్మకాలు 7.4 శాతం, పెట్రోల్ 4.3 శాతం వార్షిక ప్రాతిపదికన పెరిగాయి. ఇది బలమైన రికవరీగా నిపుణులు స్పష్టం చేశారు. కాని, నవంబర్‌లో డీజిల్ ఇంధన వినియోగం మళ్లీ తిరోగమనం కారణంగా పూర్తిస్థాయిలో కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా మొత్తం శుద్ధి చేసిన ఇంధన డిమాండ్‌లో డీజిల్ దాదాపు 40 శాతం వాటాను కలిగి ఉంది. డీజిల్ వినియోగం దేశ ఆర్థిక కార్యకలాపాలను సూచిస్తుంది. డీజిల్ వినియోగం తగ్గిందంటే రవాణాతో పాటు పరిశ్రమల నుంచి తక్కువ డిమాండ్ ఉన్నట్టు భావించవచ్చని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు.

పండుగ సీజన్‌లో భారీ కొనుగోళ్ల సమయంలో వినియోగదారుల వస్తువులను నిల్వ చేసేందుకు అవసరమైన ట్రక్కులు ప్రయాణం చేయడం వల్ల అక్టోబర్‌లొ డిమాండ్ అధికంగా ఉందని సంబధిత అధికారి చెప్పారు. నవంబర్‌లో దీపావళి వరకు కొనుగోళ్లు జరిగినప్పటికీ పండుగ తర్వాత కొనుగోళ్లతో పాటు వస్తువుల రవాణా మందగించిందని విశ్లేషకులు పేర్కొన్నారు. అందుకే ఇంధన వినియోగం తగ్గిందని వారంటున్నారు.

Advertisement

Next Story