‘ఫారిన్ స్టడీస్’ పేరుతో విద్యార్థులకు గాలం..

by  |
‘ఫారిన్ స్టడీస్’ పేరుతో విద్యార్థులకు గాలం..
X

దిశ ప్రతినిధి, మెదక్ : ‘మీ పిల్లలను విదేశాల్లో చదివించాలని అనుకుంటున్నారా..? రష్యా ఫిలిప్పైన్స్, జర్మనీ, యూకే, ఇంకా ఏ దేశమైనా మీరు కోరుకున్న చోటకు మీ పిల్లల్ని పంపించి వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తాం. తక్కువ ఫీజు.. సులభ వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉంది. స్కాలర్‌షిప్ అవకాశం సైతం కల్పిస్తాం. మీరు ఓకే అంటే.. సీటు రిజర్వ్ చేస్తాం’. అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌లు, మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ ఏడాది ఇంటి నుంచే ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నామని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దళారులు గాలం వేస్తున్నారు. కాస్త పాజిటివ్‌గా రెస్పాండ్ అయితే ఇక ఫోన్లు చేస్తూ సీట్లు అయిపోతున్నాయని, రిజర్వ్ చేసుకోవాలని ఆత్రపెడుతున్నారు.

కరోనా ప్రభావం విద్యారంగంపై ఎక్కువగానే పడింది. జూన్‌లో ప్రారంభం కావాల్సిన విద్యా‌ సంస్థలు ఇంకా ప్రారంభం కాలేదు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ప్రభుత్వాలు అనుమతినివ్వడం లేదు. ప్రవేశ పరీక్షలు, కౌన్సెలింగ్‌లు అన్ని వాయిదా వేస్తూ వస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. సర్టిఫికెట్ల జారీ, సీట్ల రిజర్వేషన్ హడావుడి కనిపించడం లేదు. యాజమాన్యానికి సీట్ల సర్దుబాటు, అదనపు అనుమతులు, ఫీజు రాయితీ ఒత్తిళ్లు దూరమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం ఉపాధ్యాయులు మాత్రమే బడికి వస్తున్నారు. ఇక ప్రైవేటు విషయానికొస్తే విద్యార్థులు, అధ్యాపకులు, కార్యాలయం సిబ్బంది, యాజమాన్యం పూర్తిగా ఇంటికే పరిమిత మయ్యారు.

ఇలాంటి సమయంలో కొన్ని యాజమాన్యాలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఆన్‌‌లైన్ తరగతుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజుల రూపంలో రూ.వేలు వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా సాంకేతిక విద్యనభ్యసించే విద్యార్థులకు మొదటి ఏడాదికి సంబంధించి నేటికీ ప్రవేశ పరీక్షలు నిర్వహించలేదు ప్రభుత్వం. దీంతో సంబంధిత కళాశాలల్లో అడ్మిషన్లు నిలిచిపోయాయి. కానీ సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఫీజులు చెల్లించాలంటూ వారి తల్లిదండ్రులకు కళాశాలల నుంచి ఫోన్‌లు వస్తున్నాయి. ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు సంబంధించిన అడ్మిషన్లకు గానూ కొన్ని కోచింగ్ సెంటర్లు, దళారీ సంస్థలు రంగప్రవేశం చేస్తున్నాయి. పది, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లకు కుప్పలు తెప్పలుగా మెసేజ్‌లు, వాయిస్ రికార్డింగ్ పంపుతూ, ఫోన్ చేస్తూ హడావుడి చేస్తున్నాయి. స్వదేశీ, విదేశీ విద్యపై ఆఫర్లు ప్రకటిస్తు గాలం వేస్తున్నాయి.

ఫోన్లు, మెసేజ్‌లు..

కరోనా నేపథ్యంలో దాదాపు అన్ని దేశాల్లోనూ విద్యా సంస్థలు తెరుచుకోవడం లేదు. ఇప్పుడు అక్కడ సైతం ఆన్‌లైన్ తరగతుల ద్వారానే విద్యాబోధన చేస్తున్నారు. వైద్య విద్య, అనుబంధ రంగంలో ఇతర కోర్సులు చేయడానికి విదేశాల్లో చాలా అవకాశాలు ఉన్నాయి. ఇదే అదునుగా భావిస్తున్న దళారులు తక్కువ ఫీజుతో విదేశీ విద్య మీ పిల్లలకు అందుబాటులో ఉందంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. చార్టెడ్ అకౌంటెంట్, వ్యవసాయ విద్య, ఇంజినీరింగ్, ఆటోమొబైల్, ఏరోస్పేస్, నేవీ ఇతరాత్ర రంగాల్లో ఉన్న కోర్సుల వివరాలు, సదుపాయాలు, వెసులుబాట్లను వివరిస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తమ మాటలతో మభ్యపెడుతున్నారు. ఎంట్రెస్స్ పరీక్షలతో సంబంధం లేదంటూ చెబుతున్నారు.

గాలం వేస్తారిలా..

మొదటగా మెసేజ్ రూపంలో సంక్షిప్త సమాచారం పంపుతున్నారు. దానికి స్పందించి ఫోన్ చేస్తే ఇక వెంటపడుతున్నారు. రోజు ఒకే కన్సెల్టింగ్ నుంచి వేరువేరు వ్యక్తుల ద్వారా ఫోన్లు చేస్తున్నారు. గంటల తరబడి వారి ఆఫర్లను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా దేశాల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, వెంటనే డబ్బు పంపి సీటు రిజర్వ్ చేసుకోవాలని వెంటపడుతున్నారు. అంతేగాక ఆరక్షణీయమైన బ్రోచర్లు పంపడం, కళాశాల ర్యాంకులు, ఉన్నత స్థాయికి ఎదిగిన విద్యార్థుల అభిప్రాయాలతో రూపొందించిన వీడియో క్లిప్పింగ్‌లను ఫోన్లకు పంపుతున్నారు. తల్లిదండ్రుల నుంచి కాస్త పాజిటివ్ వాయిస్ వినిపిస్తే చాలు సీటు రిజర్వ్ చేసుకునే వరకు వదలడం లేదు.

తల్లిదండ్రుల్లో స్తబ్దత..

కరోనా మహమ్మారి చుట్టు ముట్టిన వేళ పిల్లలను బయటకు పంపాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. విదేశాలు, సుదూర ప్రాంతాలకు పిల్లలను పంపడానికి ఇష్టపడే వారి సంఖ్య తగ్గింది. విదేశాలకు పంపించాక ఏదైన సమస్య వస్తే ఎలాగని సందేహిస్తున్నారు. స్థానికంగానే పిల్లలను చదివిస్తూ వచ్చే ఏడాది చూద్దామనే ఆలోచనలో మరికొందరున్నారు. దీంతో ఈసారి విద్యా సంవత్సరం కోల్పోవాల్సి వస్తోందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బాధపడుతుంటే, దళారులు మాత్రం విదేశీ విద్య, గొప్ప విద్యాసంస్థల పేరు మీద ఆఫర్లు ప్రకటిస్తూ ఊరిస్తున్నారు.


Next Story

Most Viewed