వడ్డీ రేట్లను తగ్గించిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్!

by  |
వడ్డీ రేట్లను తగ్గించిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్!
X

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది వరకూ దేశంలో మందగమన స్థితి ఉంటే, ఈ ఏడాది తొలి నుంచి కరోనా సంక్షోభం నెలకొనడంతో ఆర్‌బీఐ వరుసగా రెపో రేట్లను, రివర్స్ రెపో రేట్లను తగ్గిస్తూ వచ్చింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు రెపో రేట్ల ప్రయోజనాలను తమ వినియోగదార్లకు బదిలీ చేయాలని ఆర్‌బీఐతోపాటు ప్రభుత్వం కూడా సూచించింది. ఈ క్రమంలోనే పలు బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్ల తగ్గింపులను బదిలీ చేశాయి. తాజాగా ప్రభుత్వ రంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సైతం వడ్డీ రేట్లను తగ్గించింది. నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు(ఎంసీఎల్ఆర్)ను 30 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించినట్టు వెల్లడించింది. ఈ కొత్త రేట్లు జూన్ 10 నుంచి అమల్లోకి రానున్నాయి. నెల, ఏడాది టైమ్ పీరియడ్ కలిగిన ఎంసీఎల్ఆర్‌ను 20 బేసిస్ పాయింట్లు, ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్‌ను 30 బేసిస్ పాయింట్లను తగ్గించింది. రెపో అనుసంధానిత రుణ రేటు(ఆర్ఎల్ఎల్ఆర్)ను ఏడాదికి 7.25 శాతం నుంచి 6.85 శాతానికి తగ్గిస్తున్నట్టు బ్యాంకు వెల్లడించింది. అంటే, రెపో రేటు 40 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీనివల్ల రిటైల్ రుణాలు, ఎంఎస్ఎంఈలకు అందించే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. రిటైల్ రుణాలు అంటే.. వెహికల్ లోన్, హోమ్ లోన్, స్టడీ లోన్‌లు తీసుకునే వారికి ప్రయోజనం ఉండనుంది. ఇటీవల ఆర్‌బీఐ రేపో రేటును 40 బేసిస్ పాయింట్లను తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివిధ బ్యాంకులు వడ్డీ రేట్ల కోతల ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తున్నాయి. ఇప్పటికే ఎస్‌బీఐ, కెనరా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. ఇప్పుడు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు కూడా తగ్గించింది.


Next Story

Most Viewed