ప్రతి యేటా మనమెంత ఆహారాన్ని వృథా చేస్తున్నామో తెలుసా..?

by Shamantha N |   ( Updated:2021-03-05 01:09:27.0  )
food wastage
X

దిశ, వెబ్ డెస్క్: ఒకవైపు రోజుకు కనీసం ఒక్కపూట తినడానికి తిండి కూడా దొరకని ప్రజలున్న ఈరోజుల్లో భారత్‌లో మాత్రం ఆహారం వృథా ఆందోళనకరంగా ఉన్నది. దేశంలో ప్రతి ఏడాది ఒక్కో కుటుంబం 50 కిలోల ఆహారాన్ని వృథాగా పడేస్తున్నదని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి తెలిపింది. యూనియన్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్ఈపీ) గురువారం నాడు ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్టు- 2021ను విడుదల చేసింది.

నివేదికలో పేర్కొన్న విషయాల ప్రకారం.. 2019లో ప్రపంచవ్యాప్తంగా తినడానికి ఆస్కారం ఉండీ డస్ట్ బిన్ లలో పడేసిన ఆహారం 931 మిలియన్ల మెట్రిక్ టన్నులు. ఇది మొత్తం ఆహార వినియోగంలో 17 శాతం కావడం గమనార్హం. గృహ సముదాయాలు, ఇనిస్టిట్యూట్స్, రిటైల్ అవుట్‌లెట్స్, రెస్టారెంట్లు ఆహారాన్ని విచ్చలవిడిగా వృథా చేస్తున్నాయని నివేదిక పేర్కొంది.

దక్షిణాసియాలో పరిస్థితులు ఆందోళనకరం..

ఫుడ్ వేస్ట్ లో దక్షిణాసియాలో నెలకొన్న పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఆదాయాలతో సంబంధం లేకుండా అన్ని దేశాల్లో ఈ పరిస్థితి ఉంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న జాబితాలో ఉన్న భారత్ వంటి దేశాలలో ఫుడ్ వేస్టేజ్ ఎక్కువగా ఉంది. భారత్‌లో ప్రతి ఏటా ఒక ఇంట్లోంచి 50 కిలలో ఆహారాన్ని చెత్తడబ్బాలలో పడేస్తున్నారు. ఇక మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌లో 65 కిలోలు, పాకిస్థాన్‌లో 74 కేజీలు, శ్రీలంకలో 76 కేజీలు, నేపాల్‌లో 82 కిలోల ఆహారాన్ని వేస్ట్ చేస్తున్నారని నివేదికలో తెలిపారు.

తిండి లేని అభాగ్యులు కోట్లలో..

ఐరాస అంచనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 2019 నాటికి సుమారు 69 కోట్ల మంది అర్థాకలితో బతుకులు వెల్లదీస్తున్నారు. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో రెట్టింపయ్యే ప్రమాదం ఉన్నది. కరోనా తీసుకొచ్చిన సంక్షోభంతో ప్రపంచంలో చాలా మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. దీంతో కోట్లాది మంది రోడ్డున పడ్డ విషయం తెలిసిందే. ఈ ప్రభావం వారి ఆర్థిక పరిస్థితి మీద కూడా ఉంటుందని ఆరోగ్య కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed