‘ఆటో’ తయారీ కేంద్రంగా భారత్

by  |
‘ఆటో’ తయారీ కేంద్రంగా భారత్
X

న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్, విడిభాగాల పరిశ్రమ వేరే దేశాల నుంచి దిగుమతులను తగ్గించుకోవాలని, వాటికి ప్రత్యామ్నాయంగా దేశీయ ఉత్పత్తుల వైపు చూడాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రపంచంలోనే టాప్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా తయారయ్యే సత్తా మనదేశ ఆటో సెక్టార్‌కు ఉన్నదని చెప్పారు.

ఎగుమతుల కోసం కంపెనీలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకున్నదని తెలిపారు. ఆటో కంపోనెంట్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏసీఎంఏ) వార్షిక సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఎంఎస్ఎంఈ నిర్వచనాన్ని మార్చిన నేపథ్యంలో విడిభాగాల పరిశ్రమకు పలుఅంశాలు కలిసొస్తాయని అన్నారు.

కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ, ‘దిగుమతులు చేసుకోవద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకు తగిన ప్రత్యామ్నాయం కోసం అన్వేషించండి. లేదా వాటిని ఎలా ఇండియాలోనే పొందగలమో యోచించండి. ప్రస్తుతం చేసుకుంటున్న దిగుమతులను ఇండియాలోనే ఎలా ఉత్పత్తి చేయాలో ఆలోచించండి. ఇక్కడే వాటి తయారీని ప్రారంభిస్తే తొలుత లాభాలు రాకపోవచ్చు.

కానీ, వాటి సంఖ్య పెరిగిన తర్వాత ఎగుమతలు చేయడానికి ముఖ్యమైన కంపెనీగా ఎదుగుతుంది. మీపై నాకు 100 శాతం నమ్మకమున్నది’ అని వివరించారు. కంపోనెంట్స్ సెక్టార్ ఉత్పత్తి, టెక్నాలజీ, నాణ్యతను పెంచుకోవాలని, దేశంలో శ్రామికులను ఉపయోగించుకుని ప్రపంచశ్రేణి సంస్థలుగా ఎదగాలని అన్నారు.

దీంతో జీడీపీ పెరుగుదలకూ తోడ్పాటునందించినవారవుతారని వివరించారు. కేవలం ఐదేళ్లలోనే ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమ ఎంతో పురోగతిని సాధించగలదని అన్నారు. ఆటోమొబైల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆటోమొబైల్ పరిశ్రమ ఉపాధి కల్పించడంలోనే కాదు, జీడీపీలోనూ గణనీయమైన వాటాను కలిగి ఉందని, ప్రభుత్వం లక్షిస్తున్న ఆత్మనిర్భర్ భారత్‌లో కీలక పాత్ర పోషించాలని అన్నారు.


Next Story

Most Viewed