‘యుద్ధానికి మేము సిద్ధమే’

న్యూఢిల్లీ: తూర్పు లడాఖ్‌లోని సరిహద్దులో చలికాలంలోనూ పూర్తిస్థాయి యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నారని ఆర్మీ ప్రకటించింది. చైనా యుద్ధ పరిస్థితులు కల్పిస్తే సుశిక్షితులైన, మానసికంగా దృఢంగా ఉన్న జవాన్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అధికంగా పట్టణాల నుంచి చేరిన చైనా జవాన్ల కంటే భారత సైనికులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని తెలిపింది.

గడ్డకట్టే చలిలోనూ దీర్ఘకాలం సరిహద్దులో ఢీ అంటే ఢీ అనడానికి భారత సైన్యం సర్వం సిద్ధంగా ఉన్నదని ఆర్మీకి చెందిన నార్తర్న్ కమాండ్ హెడ్‌క్వార్టర్ ప్రకటించింది. చలికాలంలో భారత్ పోరాడటానికి సంసిద్ధంగా లేదని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ రిపోర్టుపై స్పందిస్తూ.. అది వారి అవివేకమని పేర్కొంది. యుద్ధం ఎదురైతే పూర్తిస్థాయిలో పోరాడేందుకు భారత ఆర్మీ సంసిద్ధంగా ఉన్నదని, చలికాలంలోనూ తూర్పు లడాఖ్‌లో శివాలెత్తేందుకు సమాయత్తమై ఉన్నదని వివరించింది.

పొరుగుదేశాలతో స్నేహపూర్వక సంబంధాలుండాలని భారత్ ఆకాంక్షిస్తున్నదని, సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవచ్చునని భావిస్తున్నట్టు నార్తర్న్ కమాండ్ ప్రతినిధి తెలిపారు. చర్చలు జరుగుతున్నప్పటికీ ఈ కాలంలోనూ అవాంఛనీయ ఘటనలు ఎదురైతే వాటిని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉన్నదని, అత్యంత ఎత్తైన ప్రాంతాల్లోనూ అతిశీతల శీతోష్ణస్థితుల్లోనూ పోరాడగలమని వివరించారు. ఇలాంటి వాతావరణంలో పోరు ఆర్మీకి అనుభవంలో ఉన్నదేనని పేర్కొంటూ సియాచిన్‌ను గుర్తుచేశారు.

Advertisement