పాక్ కవ్వింపులకు ధీటుగా జవాబిస్తాం : ఆర్మీ చీఫ్

by Shamantha N |
పాక్ కవ్వింపులకు ధీటుగా జవాబిస్తాం : ఆర్మీ చీఫ్
X

న్యూఢిల్లీ: పాక్ కవ్వింపు చర్యలకు గట్టి సమాధానమిస్తామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె అన్నారు. జమ్ము కశ్మీర్‌లోకి ఉగ్రవాదులను తరలించే తప్పుడు పద్ధతినే పాక్ ఇప్పటికీ అనుసరిస్తున్నదని చెబుతూ.. పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులకు అండగా ఉంటున్నదని తెలిపారు. ఈ విధానాన్ని ఇలాగే కొనసాగిస్తే అందుకు ధీటుగా స్పందిస్తామని తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు, ఉగ్రవాదుల చొరబాట్లు, తీవ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలకు తగిన విధంగా జవాబు చెబుతామని వివరించారు. పాకిస్తాన్.. కరోనావైరస్‌పై పోరాటానికి శ్రద్ధ చూపించట్లేదు.. కానీ, ఇలా సరిహద్దుల్లో కాల్పులు జరిపే కవ్వింపు చర్యలనే ఇష్టపడుతున్నది. ఎల్‌ఓసీ గుండా తరుచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పౌరులను లక్ష్యం చేసుకుంటున్న పాకిస్తాన్.. భారత్‌కే కాదు, ప్రపంచానికి పెను ప్రమాదకారి అని తెలిపారు. టెర్రరిస్టుల జాబితా నుంచి ఉగ్రవాదులను తప్పించడాన్ని చూస్తే.. తీవ్రవాదాన్ని ప్రోత్సహించి.. తరలించడమే దాని విధానంగా అర్థమవుతున్నదని పేర్కొన్నారు. ఇండియాలోనే కాదు.. అఫ్ఘనిస్తాన్‌లోనూ ఉగ్ర కార్యకలాపాలకు పాక్ సాయం చేస్తున్నదని చెప్పారు. హంద్వారా ఎన్‌కౌంటర్‌పై స్పందిస్తూ.. ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు భద్రతా సిబ్బందిపట్ల గర్విస్తున్నారని అన్నారు. ఉత్తర కశ్మీర్‌లోని ఓ గ్రామ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వారి ప్రాణాలను అడ్డువేశారని తెలిపారు. ఆ సెక్యూరిటీ టీమ్‌కు నాయకత్వం వహించిన కల్నల్ అశుతోష్ శర్మ సాహసాలను ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు.

tags: jammu kashmir, encounter, pakistan, violations, terrorism, precise response, army chief

Advertisement

Next Story

Most Viewed