GDP అంచనాలు సవరించిన రేటింగ్ ఏజెన్సీలు!

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (GDP) మరింతగా కుదించుకుపోయే అవకాశాలున్నాయని రేటింగ్ ఏజెన్సీ (Rating agencies)లు అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వ జీడీపీ గణాంకాల వెల్లడి అనంతరం ఏజెన్సీలు తమ అంచనాలను సవరిస్తున్నాయి. తాజాగా దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ మంగళవారం జీడీపీని 2020-21 ఆర్థిక సంవత్సరానికి (Financial year) ఇదివరకు అంచనా వేసిన 5.3 శాతం ప్రతికూలత నుంచి 11.8 శాతానికి సవరించింది.

అలాగే, 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఇప్పుడున్న బలహీనతల అనంతరం 9.9 శాతం పుంజుకోవచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనా -11.8 శాతం నమోదైతే దేశ చరిత్రలోనే అతి తక్కువ జీడీపీ వృద్ధి అవుతుంది. అంతకుముందు కనిష్ఠ స్థాయి 1979-80 ఆర్థిక సంవత్సరలో 5.2 శాతం ప్రతికూలంగా నమోదైనట్టు ఏజెన్సీ పేర్కొంది. అంతేకాకుండా, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో రూ. 18.44 లక్షల కోట్ల ఆర్థిక నష్టం (Financial loss) ఉండొచ్చని అంచనా వేసింది. ఏజెన్సీ గణాంకాల ప్రకారం..రిటైల్ ద్రవ్యోల్బణం (Retail inflation)5.1 శాతంగా, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం (Whole sale inflation) 1.7 శాతం ప్రతికూలతలను నమోదు చేస్తాయని అంచనా వేసింది.

ఫిచ్ రేటింగ్స్…

మరో రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ (Fitch ratings) కూడా జీడీపీ సంకోచం 10.5 శాతం ఉండోచ్చని అంచనా వేసింది. జూన్ త్రైమాసికంలో భారత్ ప్రపంచంలోనే అధిక జీడీపీ సంకోచాన్ని నమోదు చేసిందని మంగళవారం వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రారంభించిన క్రమంలో జీడీపీ పుంజుకునే అవకాశాలున్నాయి కానీ రికవరీలో మందగమన సంకేతాలు కనిపిస్తున్నాయని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనాను 5 శాతం నుంచి 10.5 శాతానికి కుదించుకుపోయే అవకాశాలున్నట్టు తెలిపింది.

Advertisement