‘రాష్ట్రాల జీడీపీ 14 శాతం కుదించుకుపోయే అవకాశం’

దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి దేశంలోని అన్ని రాష్ట్రాల దేశీయోత్పత్తి(జీఎస్‌డీపీ) తీవ్రంగా ప్రభావితమవుతాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సోమవారం ఓ నివేదికలో పేర్కొంది. లాక్‌డౌన్ సమయంలో ఆర్థిక కార్యకలాపాలను దెబ్బతీస్తుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌డీపీ 14.3 శాతం వరకు కుదించుకుపోయే అవకాశముందని నివేదిక తెలిపింది. ముఖ్యంగా అస్సాం, గోవా, గుజరాత్, సిక్కిం వంటి రాష్ట్రాల వృద్ధి రేటు రెండంకెల సంకోచించవచ్చని నివేదిక పేర్కొంది.

‘దేశంలోని అన్ని రాష్ట్రాల జీఎస్‌డీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కుదించుకుపోతుందని, ఇది 1.4 శాతం నుంచి 14.3 శాతం పరిధిలో ఉంటుందని’ నివేదిక స్పష్టం చేసింది. వ్యవసాయ కార్యకలాపాలపై ప్రభావం తక్కువ ఉన్నందున మిగిలిన రాష్ట్రాల కంటే వ్యవసాయాధారిత రాష్ట్రాలు తక్కువ నష్టపోతాయని నివేదిక అభిప్రాయపడింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, ఐటీ అనుబంధ రంగాలు తక్కువ ప్రభావితమవుతాయని, వీరి వ్యాపార కార్యకలాపాల్లో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను అధికంగా వినియోగించడం వల్ల కొంత నిలదొక్కుకుంటాయని నివేదిక తెలిపింది. కాగా, ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థ 4.5 శాతం కుదించబడుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement