- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కివీస్‌దే విక్టరీ.. ‘రాస్’కోమన్నడు!
భారత జట్టు విజయయాత్రకు బ్రేక్ పడింది. న్యూజిలాండ్ గడ్డపై ఐదు టీ-20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా ఆ ఊపును వన్డేల్లో కొనసాగించలేకపోయింది. తొలి వన్డేలో 347 పరుగుల భారీ స్కోరును కాపాడుకోలేక ఓటమి పాలైంది. రాస్ టేలర్ వీరోచితమైన ఇన్నింగ్స్‌తో కివీస్ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. టీ-20ల ఓటమి పరాభవాన్ని ఎంతో కొంత తగ్గించాడు. శతకంతో రాణించిన రాస్‌టేలర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ హమిల్టన్ వేదికగా బుధవారం జరిగింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ భారత జట్టును మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఓపెనర్లు పృథ్వీషా (20), మయాంక్ అగర్వాల్(32) రాణించలేకపోయినా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అర్ధసెంచరీ పూర్తిచేసిన కోహ్లీ.. 51 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సౌథీ బౌలింగ్‌లో వెనుతిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన లోకేశ్ రాహుల్ ధాటిగా ఆడాడు. అయ్యర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. శ్రేయస్ అయ్యర్ తన కెరీర్‌లో తొలి శతకం బాదాడు. 107 బంతుల్లో 103 (11 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేసి సౌథీ బౌలింగ్‌లో సాంట్నార్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. లోకేశ్ రాహుల్ 64 బంతుల్లో 88 పరుగులు (3 ఫోర్లు, 6 సిక్స్‌లు), కేదార్‌జాదవ్ 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 347 పరుగులు చేసింది.
భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కివీస్ ఓపెనర్లు మార్టిన్ గప్టిల్, హెన్రీ నికోల్స్ ఆ జట్టుకు మంచి శుభారాంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలిసి 85 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడీని శార్దూల్ ఠాకూర్ విడదీశాడు. మార్టిన్ గప్టిల్ 32 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేదర్ జాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన టామ్ బ్లండెల్ 9 పరుగులకే కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 109 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న కివీస్ జట్టును రాస్ టేలర్ ఆదుకున్నాడు. హెన్రీ నికోల్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ కలిసి కివీస్ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. 78 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నికోల్స్‌ను విరాట్ కోహ్లీ రనౌట్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన టామ్ లాథమ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రాస్ టేలర్‌తో కలిసి కివీస్‌ను విజయం వైపు నడిపించాడు. ఇద్దరూ కలిసి 138 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాస్‌టేలర్ 84 బంతుల్లో 109 పరుగులు(10 ఫోర్లు, 1 సిక్స్) చేయగా, లాథమ్ 48 బంతుల్లో 69 పరుగులు (8 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశాడు. విజయం ఖరారైంది అనుకోగా టామ్ లాథమ్‌ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన గ్రాండ్‌హ్‌మ్ ఒక్క పరుగుకే వెనుతిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన సాంట్నార్‌తో కలిసి రాస్‌టేలర్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. మరో 11 బంతులు మిగిలి ఉండగానే విజయం కివీస్ సొంతమైంది. ఆరు వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 348 పరుగులు చేసింది
బౌలర్లు విఫలం
మొదట బ్యాటింగ్ చేసి 347 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచినా భారత బౌలర్లు మ్యాచ్‌ను కాపాడలేకపోయారు. బౌలర్లందరూ భారీగా పరుగులను సమర్పించుకున్నారు. 10 ఓవర్లు వేసిన కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసినా 84 పరుగులు ఇచ్చాడు. 9 ఓవర్లు వేసిన శార్దూల్ ఠాకూర్ ఒక్క వికెట్ తీసి 80 పరుగులు సమర్పించుకున్నాడు. రవీంద్ర జడేజా 10 ఓవర్లలో 64 పరుగులు, మహ్మద్ షమి 9.1 ఓవర్లలో 63 పరుగులు, బుమ్రా 10 ఓవర్లలో 53 పరుగుల ఇచ్చారు. బౌలర్లలో ఎవరూ రాణించకపోవడంతో విజయం న్యూజిలాండ్ సొంతమైంది.