‘భారత్ వృద్ధి త్వరలో అలా వెళ్తుంది’

by Harish |
‘భారత్ వృద్ధి త్వరలో అలా వెళ్తుంది’
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 సంక్షోభం నుంచి దేశ ఆర్థికవ్యవస్థ త్వరలో కోలుకుంటుందనే నమ్మకం ఉందని దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎండీ, సీఈవో ఆదిత్య పూరి అభిప్రాయపడ్డారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పదని నుంచి ఆదిత్య పూరి ఈ నెల 26న అధికారికంగా పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆర్థికవ్యవస్థ గురించి అభిప్రాయాలను పంచుకున్నారు. గత 26 ఏళ్లుగా బ్యాంకుకు సేవలందించిన ఆయన, దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీని మార్చిన ఘనత సాధించారు.

భవిష్యత్తులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుగా మారుతుందని ఆయన భావిస్తున్నారు. కొవిడ్-19 వ్యాప్తి ఉన్నప్పటికీ భారత వృద్ధిపై బలమైన నమ్మకం ఉందని ఆయన చెప్పారు. త్వరలో దేశ ఆర్థికవ్యవస్థ తిరిగి ట్రాక్‌లోకి వస్తుందని ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే, ఆర్థికవ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో 9 శాతం జీడీపీ వృద్ధిని సాధించేందుకు సమయం పడుతుందని, కానీ వ్యాపారాలు వేగంగా కోలుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు.

కాగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త చీఫ్‌గా శశిధర్ జగదీశన్‌ను సంస్థ నియమించింది. అయితే, ఆదిత్య పూరి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ బ్యాంకింగ్ రంగంలోనే కొనసాగుతారనే నమ్మకకుందని, గ్లోబల్ కార్పొరేషన్లలో సలహాదారుగా కొనసాగుతారని చాలామంది అధికారులు భావిస్తున్నారు. బ్యాంకులో పదవీ విరమణ చేసిన తర్వాత కూడా అంతర్జాతీయ, దేశీయ పెద్ద సంస్థలలో బోర్డు పదవిని చేపట్టే అంశం గురించి పరిశీలిస్తున్నట్టు ఆదిత్య పూరి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed