ఉమర్ అక్మల్ సస్పెన్షన్ సగానికి తగ్గింపు

by Shiva |
ఉమర్ అక్మల్ సస్పెన్షన్ సగానికి తగ్గింపు
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ సీనియర్ బ్యాట్స్‌మాన్ ఉమర్ అక్మల్‌కు విధించిన 3 ఏళ్ల సస్పెన్షన్‌ను సగానికి తగ్గిస్తూ స్వతంత్ర న్యాయ నిర్ణేత, పాకిస్తాన్ మాజీ సుప్రీంకోర్టు జడ్జి ఫకీర్ మహ్మద్ ఖోఖర్ తీర్పు ఇచ్చారు. అవినీతి నిరోధక చట్టాన్ని రెండు వేర్వేరు సందర్భాల్లో ఉల్లంఘించాడని ఆరోపిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) క్రమశిక్షణ కమిటి చైర్మన్ ఫజల్ ఇ మిరాన్ చౌహాన్ అతనిపై గత ఏప్రిల్ 27న మూడేళ్ల నిషేధాన్ని విధించారు. తాను తప్పు చేశానని, శిక్షను తగ్గించాలని కోరుతూ మే 19న అక్మల్ అప్పీలు చేసుకున్నాడు.

దీనిపై స్పందించిన న్యాయనిర్ణేత ఖోఖర్ అతడిపై నిషేధాన్ని సగానికి తగ్గించారు. ఈ ఏడాది ఫ్రిబవరి నుంచి వచ్చే ఏడాది అగస్టు వరకు అక్మల్‌పై నిషేధం అమలులో ఉంటుంది. తీర్పు అనంతరం అక్మల్ మాట్లాడుతూ ‘నా లాయర్‌ వాదనలు విన్నందుకు న్యాయమూర్తికి ధన్యవాదాలు. ఈ తీర్పుతో నేను అస్సలు సంతృప్తిగా లేను. శిక్షను తగ్గించుకునేందుకు మరిన్ని ప్రయత్నాలు చేస్తాను. ఇందుకు నా లాయర్‌, కుటుంబసభ్యుల సలహాలు తీసుకుంటా. నా కంటే ముందు ఎందరో ఆటగాళ్లు తప్పులు చేశారు. వారందరికి చిన్న శిక్ష వేశారు. కానీ నాకు మాత్రం పెద్ద శిక్ష వేశారు’ అని వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్‌కు ముందు కొంత మంది బుకీలు మ్యాచ్ ఫిక్సింగ్ కోసం అక్మల్‌ను సంప్రదించిన విషయం పీసీబీకి చెప్పినందుకు అతనికి ఈ శిక్ష విధించింది.

Advertisement

Next Story