- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏడాది వరకూ ఇదే రేటు
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా రైతులు విస్తృతంగా కూరగాయలు సాగు చేసేవారు. గ్రేటర్ హైదరాబాద్ కు అతి సమీపంలో ఉండడంతో రైతులకు బాగానే గిట్టుబాటు అవుతుండేది. తెల్లవారు జామునే బస్సులు, ప్రత్యేక వాహనాల్లో మార్కెట్ కు తరలించేవారు. కరోనా ప్రభావం కూరగాయల సాగుపై పడింది. పండించిన కొద్దిపాటి కూరగాయలను నగరానికి తీసుకెళ్లేందుకు భయపడుతున్నారు. ఇక రైతులు దిక్కుతోచని స్థితిలో కూరగాయల స్థానంలో ఆరుతడి పంటలు సాగు చేశారు. దీంతో మార్కెట్‌లో కూరగాయలకు కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
రంగారెడ్డి జిల్లాలోని మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు విస్తృతంగా కూరగాయలు సాగు చేస్తారు. ఈ ప్రాంత ప్రజలకు నగరం అందుబాటులో ఉండడంతో ఉదయం 5గంటల వరకు పొలాల నుంచి తెచ్చిన కూరగాయలు, ఆకుకూరలు తీసుకుని సైదాబాద్లోని మాధన్నపేట మండి, ఎల్బీనగర్లోని ఎన్టీఆర్ నగర్ మార్కెట్కు తరలిస్తారు. ఇందుకోసం ఆయా గ్రామాల నుంచి ప్రత్యేకమైన నైట్ హాల్ బస్సులుండేవి. ఇప్పుడు బస్సుతో పాటు ఇతర రవాణా సౌకర్యం లేకపోవడంతో కూరగాయాల సాగు చేస్తే నష్టం వస్తుందని రైతులు ఆ పంటలు వేయనట్లు తెలుస్తోంది. ఉదారహణకు కందుకూరు మండలం బాచుపల్లి గ్రామంలో సుమారుగా 25 మంది రైతులు కూరగాయలు సాగు చేసేవారు. ఇప్పుడు వీరందరూ పత్తి పంట సాగుచేశారు. ఇదే మండలంలోని కొత్తగూడంలో సుమారుగా 34 మంది రైతులు ప్రతి రోజు పండించిన కూరగాయలను నగరానికి తరలించేందుకు ప్రత్యేక బస్సు ఉండేది. ఈ బస్సు అందుబాటులో లేకపోవడంతో 6 నెలల క్రితమే కూరగాయల పంటలను తొలగించి వరి, పత్తి, కంది పంటలను వేసుకున్నారు.
సగానికి పడిపోయిన సాగు..
రంగారెడ్డి జిల్లా కూరగాయల సాగుకు పెట్టింది పేరు. కరోనా వైరస్ వ్యాప్తితో రైతులు సైతం పొలాలకే పరిమితమయ్యే పంటలనే సాగు చేసుకుంటున్నారు. గతేడాది 37,369 ఎకరాల్లో కూరగాయల సాగు చేస్తే, ఈ ఏడాది కేవలం 14,624 ఎకరాలకే సాగు పరిమితం కావడం గమనర్హం. 22,745 ఎకరాల కూరగాయల సాగును వదిలిపెట్టి ఇతర పంటలపై రైతులు నిమగ్నమైనారు. సాధారణంగా రంగారెడ్డి జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురిసినపుడు సాధారణ సాగు సుమారుగా 70వేల ఎకరాలు ఉంటుంది. కానీ, ఒక వైపు రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో ప్రతి ఏడాది వేల సంఖ్యల ఎకరాల్లో సాగు పడిపోతోంది. దీంతో ప్రస్తుత సాధారణ సాగు 50వేల ఎకరాలకు తగ్గింది. కూరగాయాల సాగు సగానికి పడిపోవడానికి ప్రధాన కారణం కరోనా వైరస్వ్యాప్తి అని రైతులు పేర్కొంటున్నారు.
ధరలకు రెక్కలు.. సామాన్యుడికి చుక్కలు
షాద్ నగర్: కరోనా కారణంగా చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న మధ్యతరగతి ప్రజలకు కూరగాయాల ధరలు దడ పుట్టిస్తున్నాయి. కూరగాయల ధరలు ఆకాశాన్నంటే స్థాయిలో దూసుకెళ్తున్నాయి.ఈ మధ్య కురిసిన వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతినడంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పంట దిగుబడులు లేక చిల్లర మార్కెట్లలో కూరగాయల కొరత ఏర్పడింది. భగ్గుమంటున్న ధరలను చూసి సామాన్య, మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు రూ.20 నుంచి రూ.30 కు కిలో వచ్చిన కూరగాయలు నేడు కిలో రూ.80 నుంచి రూ.100కు చేరుకున్నాయి. దీంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. నెల క్రితం రూ.100కే అన్ని రకాల కూరగాయలు దొరికిన పరిస్థితి. కానీ ఇప్పుడు రూ.100కు రెండు, మూడు రకాలు కూడా రాని పరిస్థితి నెలకొంది. టమాట రూ.35-40, బీన్స్, చిక్కుడు, క్యారెట్ నాణ్యతను బట్టి రూ.80 నుంచి రూ.90 వరకు కిలో పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కిలో పచ్చి మిర్చి రూ.100 దాటింది. బెండకాయ రూ.80, బీరకాయ రూ80 పలుకుతుండడతో సామాన్యుడి ఇంట వంట కష్టంగా మారింది.
కరోనాతో సాగు నిలిపివేశాం: నాగమణి, బాచుపల్లి
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో భయపడ్డాము. కూరగాయలు సాగు చేసి నగరానికి తీసుకెళ్లడం అభద్రతగా భావించాం. పెట్టుబడి పెట్టి స్థానికంగా విక్రయిస్తే ధర గిట్టుబాటు కాదు. అదే నగరంలోని మార్కెట్కు తీసుకెళ్తే పెట్టిన పెట్టుబడి వస్తుందని ఆశ. కానీ, కరోనా పుణ్యమాని సాగు చేస్తే కూరగాయలు అమ్మడం కష్టమైతుంది. అందుకే ఈ సారి పత్తి పంట సాగు చేశాము.
కూరగాయల సాగు తగ్గింది: సునంద రెడ్డి, ఉద్యానశాఖాధికారి
ప్రతి ఏడాది రంగారెడ్డి జిల్లాలో సాధారణ సాగులో 85శాతం రైతులు కూరగాయలు పండించేది. కరోనాతో పండించిన పంటలు విక్రయించేందుకు రైతులు భయపడుతున్నారు. కూరగాయల నుంచి మరో పంటకు మారారు. దీంతో కూరగాయల సాగు తగ్గి ధరలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితి ఏడాది చివరి వరకు ఉంటుంది.