ఆ ముగ్గురూ ఒకవైపు ?

by Shyam |
ఆ ముగ్గురూ ఒకవైపు ?
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాజ్యసభ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఎంపిక పార్టీ అధినేత కేసీఆర్‌కు సవాలుగా మారింది. రాష్ట్రం నుంచి ఎన్నిక కావాల్సిన రెండు సీట్లలో ఒకదాన్ని ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ కేశవరావుకు ఖరారు చేశారు. మరో సీటు కోసం ముమ్మర పోటీ నెలకొంది. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యాపారవేత్త పార్థసారధిరెడ్డి బరిలో ముందు వరుసలో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరిని ఖరారు చేయాలన్నది కీలకంగా మారింది. పొంగులేటికి ఇవ్వాలని పార్టీలోని ఒక వర్గం ఒత్తిడి తెస్తుండగా కేసీఆర్ మాత్రం పార్థసారధిరెడ్డికే ఇవ్వాలన్న అభిప్రాయంతో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అభ్యర్థి ఎంపిక ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ముందు నుయ్యి, వెనక గొయ్యి చందంగా తయారైంది. అయితే పొంగులేటి పేరు ప్రముఖంగా వినిపిస్తుండడంతో ఖమ్మం జిల్లాలోని ముగ్గురు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఆ ముగ్గురి మధ్య సంబంధాలు ఎలా ఉన్నప్పటికీ పొంగులేటికి ఇవ్వరాదన్న అంశంలో మాత్రం ఒకే అభిప్రాయంతో ఉన్నారు. అందుకే ఆ ముగ్గురూ ఒక జట్టుగా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం జిల్లా పార్టీ వర్గాల సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటే… లోక్‌సభ సభ్యుడు నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ … ఈ ముగ్గురూ పొంగులేటికి రాజ్యసభ టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలో రాజకీయమంతా పువ్వాడ అజయ్ చుట్టే తిరుగుతోంది. ఇప్పుడు పొంగులేటికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే సమాంతరం పవర్ సెంటర్ ఆవిర్భవిస్తుందన్న భయం అజయ్‌ను వెంటాడుతోంది. పొంగులేటితో పాటు కలిసే వెళ్ళిన అజయ్ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. కానీ ఎక్కడా పొంగులేటిపై అసంతృప్తిని అజయ్ బహిర్గతం చేయలేదు. నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు సైతం పొంగులేటికి రాజ్యసభ టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం.

పార్థసారధిరెడ్డికి టికెట్ ఇవ్వడంలో ఈ ముగ్గురిలో ఎవ్వరికీ వ్యతిరేకత లేదు. కానీ పొంగులేటి విషయంలో మాత్రమే వీరికి చాలా అసంతృప్తి ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైరా నుంచి రాములునాయక్‌ (టీఆర్ఎస్ రెబల్)ను, పాలేరు నుంచి కందాల ఉపేందర్‌రెడ్డి (కాంగ్రెస్)లను గెలిపించుకోవడంలో పొంగులేటి కీలక పాత్ర పోషించారన్నది బహిరంగ రహస్యం. ఇక మధిర నుంచి సైతం మల్లు భట్టి విక్రమార్కను ఓడించడానికి పొంగులేటి శతవిధాలా ప్రయత్నించారని, సక్సెస్ కాలేకపోయినా మెజారిటీని భారీ స్థాయిలో తగ్గించగలిగారు. పొంగులేటి ఒక వ్యక్తిగా రాజకీయం మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకుంటారని, పార్టీ అప్రాధాన్యమవుతుందన్నది వారి వాదన.

ఈ రాజకీయం చివరకు ఖమ్మం జిల్లాలో పార్టీకి ఏం ఎసరు తీసుకొస్తుందో అనే అనుమానమూ పార్టీ వర్గాల్లో లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క పువ్వాడ అజయ్ మినహా టీఆర్ఎస్ అభ్యర్థులెవ్వరూ గెలవలేదు. వ్యక్తిగతంగా పొంగులేటి ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపించారన్న వార్త జిల్లా మొత్తానికి తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో పొంగులేటికి రాజ్యసభ టికెట్ ఇస్తే జిల్లా నాయకుల్లో అసంతృప్తి చోటుచేసుకోవడం ఖాయం. ఇవ్వకపోతే ఆయన నుంచి పార్టీకి ఏం చెడు జరుగుతుందోననే ఆందోళనా ఉంది. ఈ రెండింటి నడుమ కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

Tags: Khammam, TRS, Rajya Sabha, Puvvada, Ponguleti, Thummala, KTR

Advertisement

Next Story

Most Viewed