పట్నంలో 13,563కు చేరిన కరోనా కేసులు

by  |
పట్నంలో 13,563కు చేరిన కరోనా కేసులు
X

దిశ, న్యూస్ బ్యూరో: రోజురోజుకూ హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు భయపెడుతున్నాయని ప్రజలు ఆందోలన వ్యక్తం చేస్తున్నట్టుగానే బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1,018 కొత్త కేసులు నమోదయ్యాయి. వెయ్యి కంటే ఎక్కువ కేసులు నమోదు కావడం ఇది రెండోసారి. హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ ఎనిమిది వందలకు తగ్గకుండా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా 881 నమోదు కాగా, మొత్తం ఇప్పటివరకూ ఒక్క హైదరాబాద్‌లోనే 13,563కు చేరడం గమనార్హం.

హైదరాబాద్ నగరంతో పాటు రోజుకొక జిల్లాల్లో పదుల సంఖ్యలో కొత్త కేసులు ఉనికిలోకి వస్తున్నాయి. మూడ్రోజుల క్రితం వరంగల్ అర్బన్, ఆ తర్వాత జనగాం, మంగళవారం సంగారెడ్డి జిల్లాల్లో పదుల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తే ఇప్పుడు మహమూబ్‌నగర్ జిల్లాలో పది కేసులు వచ్చినట్టు హెల్త్ బులెటిన్ పేర్కొంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం తొమ్మిది నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల్ని ఆసుపత్రిలో చికిత్స చేయడానికి వీలుగా ప్రయివేటు బోధనాసుపత్రులను సైతం బెడ్‌లు, వార్డుల్ని సమకూర్చాల్సిందిగా మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. నాలుగు ప్రైవేటు మెడికల్ కళాశాలలను, వాటికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్ని సందర్శించారు.

ఇంటర్ బోర్డులో సిబ్బందికి పాజిటివ్

ఇంటర్మీడియట్ బోర్డులోని సిబ్బందికి కూడా పాజిటివ్ వచ్చినట్టు వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఒక్కో ఆఫీసులో ఇలా ప్రతీరోజు కొత్త పాజిటివ్ కేసులు ఉనికిలోకి వస్తూనే ఉన్నాయి. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ ఆఫీసులో సైతం తాజాగా కొన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే యాభై శాతం మంది ఉద్యోగులు విధులకు వస్తే సరిపోతుందని, మిగిలినవారు వర్క్ ఫ్రం హోమ్ పనిచేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఆ యాభై శాతం మంది ఉద్యోగుల్లో సైతం పాజగిటివ్ వస్తుండడంతో సహ ఉద్యోగులు క్వారంటైన్‌లోకి వెళ్తున్నారు. దీంతో రోజువారీ పనులకు అంతరాయం కలుగుతోంది.


Next Story

Most Viewed