భ‌ద్రాది అడ‌వుల్లో వేట‌.. ముఠా అరెస్టు

by  |
భ‌ద్రాది అడ‌వుల్లో వేట‌.. ముఠా అరెస్టు
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: పంగోలిన్ చర్మానికి (అలుగు పొలుసులు) జాతీయ, అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్లలో అత్యంత డిమాండ్ ఉందనే కారణంతో వాటిని అక్రమంగా సేకరించి అమ్మకానికి పెట్టిన అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు వారం రోజుల పాటు నిఘా పెట్టిన అటవీ శాఖ అధికారులు, కొనుగోలు దారుల అవతారం ఎత్తి మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌తో సహా కొత్తగూడెం, భద్రాచలం, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌లలో అధికారులు ఈ ఆపరేషన్ పాల్గొన్నారు.

భద్రాచలం అటవీ ప్రాంతంలో గిరిజనులకు కొద్ది మొత్తం ఆశ చూపి, ఈ ముఠా చర్మాలను సేకరిస్తోంది. ముందుగా సమాచారం అందుకున్న కొత్తగూడెం అటవీ అధికారులు బాదావత్ రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు.

అతను ద్వారా సేక‌రించిన స‌మాచారంతో మూడు రోజుల పాటు హైదరాబాద్‌తో సహ వివిధ ప్రాంతాల్లో అటవీ అధికారులు నిఘా పెట్టి సునీల్, నాగరాజులతో పాటు మరో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని అటవీ, వన్యప్రాణుల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ముఠాలో ఇంకా ముగ్గురు ఉన్నారని, వారు పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు.

అంతరాష్ట్ర ముఠాలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఒరిస్సా, బెంగాల్ వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుత ముఠా నుంచి సుమారు నాలుగు కేజీల పొలుసులను అటవీ శాఖ స్వాధీనం చేసుకుంది. ఇందుకోసం మూడు నుంచి ఐదు జంతువులను దమ్మపేట అటవీ ప్రాంతంలో (కొత్తగూడెం) చంపిఉంటారని అధికారులు భావిస్తున్నారు. పోలీసుల సహకారంతో కొత్తగూడెం మెజిస్ట్రేట్ ఎదుట నిందితులను ప్రవేశ పెట్టి, రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం నిందితులందరూ ఖమ్మం సబ్ జైలులో ఉన్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి రంజిత్ నాయక్ తెలిపారు.


Next Story