రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్ష సూచన

by  |
రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్ష సూచన
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో రాగల రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరఠ్వాడ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాల్లో ఆగస్టు 4న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు.

కాగా ఉపరితల ద్రోణి కారణంగా శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. శని, ఆదివారాల్లో కూడా రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు , తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం గ్రేటర్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

ఉదయం నుంచే ప్రారంభమైన వర్షం గ్రేటర్ పరిధిలోని కుత్భుల్లాపూర్, అల్వాల్, బాలానరగ్, మల్కాజిగిరి, శంకరంపేట, కల్హేరు, మారేడుపల్లి, ఉప్పల్, తిర్మలగిరి ప్రాంతాల్లో సగటున 3 సెంటీమీటర్ల మేర కురిసింది. ఇక రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో భారీ వర్షం కురిసింది. ఇక్కడ 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే విధంగా వికారాబాద్ జిల్లా కోటపల్లిలో 12 సెంటీమీటర్ల వర్షం పడింది. రంగారెడ్డి జిల్లాలో 8.4 సెంటీమీటర్లు, మెదక్ లో 6. 9 సెంటీమీటర్ల వాన పడింది. దాదాపు 20 జిల్లాలో పరిధిలో వర్షం కురిసింది. ఇప్పటికే కురిసిన వానలతో గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. ఈరోజు కురిసిన వానలతో పలు చెరువుల్లో అలుగుపారాయి.


Next Story

Most Viewed