డాక్టర్లకు ఐఎంఏ 'రెడ్ అలర్ట్'

by Shyam |
డాక్టర్లకు ఐఎంఏ రెడ్ అలర్ట్
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలోని డాక్టర్లు, నర్సులతో పాటు మొత్తం వైద్య సిబ్బందికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. కరోనా చికిత్స చేస్తూ డాక్టర్లు, వైద్య సిబ్బంది చనిపోతున్నారని, ఇది బాధాకరమని, వృత్తిపరంగా వైద్య సేవలు ఎంత ముఖ్యమో స్వీయ రక్షణ కూడా అంతే ముఖ్యమని పేర్కొనింది. కరోనా కారణంగా సంభవిస్తున్న మరణాలు తగ్గాలంటే అది డాక్టర్లతోనే మొదలుకావాలని ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రంజన్ శర్మ, డాక్టర్ ఆర్వీ అశోకన్‌లు సంయుక్త ప్రకటనలో తెలిపారు. కరోనా విధుల్లో ఉన్న వైద్యసిబ్బంది నిర్దిష్ట ప్రోటోకాల్‌ను విధిగా పాటించాల్సిందేనని, ఏ మాత్రం అలసత్వం, నిర్లక్ష్యం, లోపాలు జరిగినా వాటిని వెంటనే గుర్తించి సరిదిద్దుకోవాలని స్పష్టం చేశారు.

ఇప్పటివరకు చనిపోయిన డాక్టర్లలో సీనియర్లు, యువకులూ ఉన్నారని, వయసుతో సంబంధం లేకుండా ఇన్‌‌ఫెక్షన్ బారిన పడి మృతిచెందుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి నష్టం జరుగుతుందని ముందే ఊహించామని, కానీ ఇకపైన ఇది పునరావృతం కాకూడదని, తగిన జాగ్రత్తలు తప్పవని స్పష్టం చేశారు. విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్లకు వారికంటే ఉన్నత స్థానాల్లో ఉన్న బాధ్యులు తగిన జాగ్రత్త చర్యలు అమలుచేయాలని సూచించారు. విధాన నిర్ణయాలు చేసే సమయంలో వైద్య సిబ్బందికి వ్యక్తిగతంగా, వారి కుటుంబ సభ్యులకు జరిగే నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు.

దేశంలో కమ్యూనిటీ వ్యాప్తి మొదలైంది: డాక్టర్ వీకే మోంగా

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది లక్షలు దాటిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఐఎంఏ కమ్యూనిటీ వ్యాప్తి జరిగిందని పేర్కొంది. సంస్థలోని హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ మోంగా శనివారం వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ప్రతీరోజు 30 వేల కంటే ఎక్కువగానే కొత్త కేసులు నమోదవుతూ ఉన్నాయని, ఈ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడంలేదని, కమ్యూనిటీ వ్యాప్తి జరిగిందనేది నిర్వివాదాంశమన్నారు. ఇది జరగరాని పరిణామమని, కమ్యూనిటీ వ్యాప్తికి అనేక కారణాలున్నాయన్నారు. పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి జరుగుతూ ఉందన్నారు. ఇది దేశానికి మంచిది కాదన్నారు.

చిన్న పట్టణాలు, గ్రామాల్లోకి వైరస్ చేరుకున్నట్లు స్పష్టమైనందున అదుపు చేయడం కష్టమని, ఇందుకు కర్నాటక, కేరళ, గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని అనుభవాలే నిదర్శమన్నారు. అయా రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రం నుంచి తగిన సహాయ సహకారాలను తీసుకోవాలని అన్నారు. వైరస్ వ్యాప్తి చాలా వేగంగా జరుగుతోందని, దీన్నుంచి బైటపడాలంటే రెండే మార్గాలున్నాయని పేర్కొన్నారు. సుమారు 70% మంది ప్రజలు వైరస్ బారిన పడినా రోగనిరోధక శక్తి సమకూరుతుందని, మిగిలినవారికి మాత్రం దాన్ని కల్పించాల్సి ఉంటుందన్నారు. వ్యక్సిన్‌పైనే ఇప్పుడు అన్ని ఆశలూ ఉన్నాయని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed