- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ వెంచర్ల దందా.. ప్రభుత్వ ఆదాయానికి గండి
దిశ ప్రతినిధి, వరంగల్: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో అక్రమ వెంచర్ల దందా జోరుగా సాగుతోంది. అరికట్టాల్సిన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యాపారులు ప్లాట్ల విక్రయాలు నిర్వహిస్తున్నారు. అక్రమ వెంచర్లు వెలుస్తున్న వాటిల్లో ఎకరం మొదలు 6 ఎకరాల్లోపు ఉన్నవే అధికంగా ఉంటుండటం గమనార్హం. ఈ తరహా వెంచర్లలో పట్టాదారు పాస్‌పుస్తకం ఆధారంగా కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ జరిగేలా చూస్తున్నారు. కుడా అనుమతులు పొందినట్లుగా కొందరు.. వచ్చేస్తున్నాయని మరికొందరు ప్లాట్లను అమ్ముతూ అమాయక జనాన్ని మోసం చేస్తున్నారు. ఇలా మోసపోయిన వారి సంఖ్య మిక్కిలిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ వెంచర్లను నివారించాల్సిన కుడా అధికారులు కళ్లు మూసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
సీఎం ఆదేశాలతో మమ..
వరంగల్, హన్మకొండ, కాజీపేట నగర శివారుల్లో వందలాది అక్రమ లేఅవుట్ల దందా యథేచ్ఛగా సాగుతోందని గతంలో ఏకంగా మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్‌కు సైతం ఫిర్యాదులు అందాయి. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అనధికారిక లేఅవుట్లను గుర్తించాలని రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకుడి నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు వెలువడ్డాక హైదరాబాద్, కరీంనగర్, నర్సంపేట, ఖమ్మం, ములుగు రోడ్డు జాతీయ రహదారుల వెంబడి ఉన్న దాదాపు 80 అక్రమ లేఅవుట్లను గుర్తించినట్లుగా తెలుస్తోంది. రాళ్లను తొలగింపు కార్యక్రమంతో చేతులు దులుపుకున్న అధికారులు ఆ తర్వాత చర్యలు తీసుకోకుండా గాలికి వదిలేయడం గమనార్హం.
నిబంధనలు గాలికి..
కరోనా మహమ్మారి ఉధృతంగా ఉండటం, లాక్‌డౌన్ ఎఫెక్ట్, ఆ తర్వాత ప్రభుత్వం రిజిస్ట్రేషన్లపై తాత్కాలిక నిషేధం అమల్లోకి తీసుకురావడం వంటి పరిణామాలతో రియల్ వ్యాపారం డల్‌గా సాగింది. అయితే వరంగల్ అర్బన్ జిల్లాలో క్రమంగా వ్యాపారం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. ఈ నేపథ్యంలోనే రియల్ వ్యాపారులు అక్రమంగా వెంచర్లను ఏర్పాటు చేసి విక్రయాలకు పాల్పడుతున్నారు. వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసే ప్రజలు ఇంటి నిర్మాణాలకు అనుమతులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేయాలంటే మొదట వాటిని నివాస స్థలాలుగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఆర్డీఓకు నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నాలా కన్వర్షన్ అనంతరం లే అవుట్ అనుమతులు సంబంధిత మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ నుంచి తీసుకోవాలి.
కుడాకు దరఖాస్తు..
ఆర్డీఓ నుంచి నాలా కన్వర్షన్ అనుమతులు రాగానే లే అవుట్ అనుమతుల కోసం కుడాకు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు గాను నిర్ణీత స్థలంలో నుంచి 10 శాతం భూమిని పార్కుల నిర్మాణం కోసం మున్సిపాలిటీకి అప్పగించాల్సి ఉంటుంది. వెంచర్‌లో అన్ని అంతర్గత రోడ్ల వెడల్పు కనీసం 40 ఫీట్లు ఉండాలి. అయితే ఇవేమీ లేకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూములు, ఇండస్ట్రియల్ స్థలాల్లో అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. లేఅవుట్ అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న వెంచర్ల కారణంగా కుడాకు ఆదాయానికి భారీ గండి పడుతోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా రియల్ వ్యాపారుల జేబుల్లోకి వెళ్తోంది.