పెద్దపెల్లి క్వారీ స్టోరీ.. దందా నడిపించేదెవరు..?

by Sridhar Babu |
పెద్దపెల్లి క్వారీ స్టోరీ.. దందా నడిపించేదెవరు..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా వెంకటాపూర్ ఇసుక క్వారీలో అక్రమాల జాతరను నిలువరించే వారు లేకపోవడానికి కారణాలు ఏంటీ..? ఈ క్వారీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న పెద్ద తలలు ఎవరివి అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మంథని సమీపంలోని వెంకటాపూర్ క్వారీ నుంచి మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు ఇసుకను తరలించేందుకు సీఎంఓలో పనిచేస్తున్న ఓ అధికారి అండదండలు ఉన్నాయని నిర్వహాకులు బాహాటంగానే చెప్పుకుంటున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. గ్రేటర్‌లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన ఓ ట్రాన్స్ పోర్టు యజమాని ద్వారా సీఎంఓలో పనిచేస్తున్న అధికారి సహకారంతో మద్దతు పొందామని తమపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఏమీ చేయలేరంటూ స్థానికులకు వార్నింగ్‌లు కూడా వెల్తున్నట్టు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుండే అండదండలు ఉన్నాయన్న భయంతో స్థానికులు క్వారీ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు కానీ అడ్డుకునేందుకు కానీ జంకుతున్నారు.

అయితే పెద్దపల్లి జిల్లాలోని అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధి ఒకరు కూడా స్థానికంగా క్వారీ నిర్వహిస్తున్న వారిపై మండిపడ్డట్టు సమాచారం. క్వారీ విషయంలో జరుగుతున్న తప్పులను ఆయన ఎత్తి చూపి మందలించినట్టు తెలుస్తోంది. దీంతో క్వారీ నిర్వహకులు సీఎంఓ అధికారి అండదండలు ఉన్నాయని కావాలనే చెప్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేసే వారు లేకపోలేదు. కానీ నిర్వహకులు మాత్రం ఫలానా అధికారి అంటూ బాహాటంగానే పేరు వాడుకుంటూ అక్రమాల జాతరకు తెరలేపారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు అవసరాల కోసం అంటూ ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు పకడ్బంధీగా వ్యవహరించడంలో ఎందుకు మిన్నకుండి పోతున్నారు.? మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులే అయినా జిల్లా యంత్రాంగమే అయినా మల్లన్న సాగర్ పేరిట మటుమాయం అవుతున్న ఇసుకను కట్టడి చేయడంలో చూసి చూడనట్టుగా ఉంటున్నారు అన్నది అంతుచిక్కకుండా తయారైంది. ఉన్నత స్థాయిలో వస్తున్న ఒత్తిళ్లే కారణమా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారూ లేకపోలేదు.

Advertisement

Next Story

Most Viewed