‘కరోనా’ కంటే కల్తీకల్లు డేంజర్!

by Shyam |
‘కరోనా’ కంటే కల్తీకల్లు డేంజర్!
X

దిశ, రంగారెడ్డి: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ అక్రమార్కులకు వరమైంది. కల్తీకల్లు తయారీదారులకు కాసులపంట పడుతోంది. మద్యంప్రియులు మద్యం దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. కొందరు మతిస్థిమితం కోల్పోతున్నారు. ఏదైతేనేం మత్తు కావాల్సిందేనంటూ కల్తీకల్లు తాగుతున్నారు. దీంతో వారి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందనీ, ‘కరోనా’ కంటే కల్తీకల్లు ప్రమాదకరమైందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో ఈ కల్తీ ద్రవాల తయారీ జోరందుకున్నది. ఇలా ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నవారిపై సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా అధికారులు పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలనీ, కఠినచర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

జోరుగా తయారీ..

మొన్న కొండన్నగూడెంలో, నిన్న దేవునిపల్లిలో, ఇవాళ సతంరాయి, గగన్ పహాడ్‌లో కల్తీకల్లు, కల్తీమద్యంతోపాటు గుట్కాలను కృతిమ పద్ధతిలో తయారు చేస్తున్నారు. ఈ కల్తీకి ప్రజలు అలవాటు పడితే వారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అమోనియం, యూరియా, హైడ్రోక్లోరో ఫామ్‌తో కల్తీకల్లు తయారీ చేస్తున్నారు. కల్తీకల్లు కాకుండా కృత్రిమ మద్యం, గుడుంబా తయారీ గ్రామాల్లో జోరుగా కొనసాగుతుంది. అయితే, తయారీదారులు, గ్రామాలపై నిఘా పెట్టి ఎస్వోటీ పోలీసులు స్థావరాలు ఛేదించి కల్తీకల్లు తయారీని బహిర్గతం చేశారు. అయితే, ఇంకా వెలుగులోకి రాని కల్తీ తయారీ కేంద్రాలు ఎన్నో ఉన్నాయని ప్రచారం సాగుతోంది. జిల్లాలో తయారీ అవుతున్న కల్తీకల్లు, కల్తీ మద్యం క్రయవిక్రయాలకు పోలీసుల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికపోలీసులకు మాముళ్లు ఇచ్చే కల్తీకల్లు తయారు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం..

గ్రామాల్లో కల్తీ కల్లు, అక్రమంగా మద్యం అమ్మకాలు, గూడంబా ఏరులై పారుతుంది. వీటిపై నిఘా పెట్టాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో పలువురు ఎస్వోటీ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దాంతో ఎస్వోటీ పోలీసులు నిఘా పెట్టి దాడి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇప్పటికీ ఎక్సైజ్ అధికారులు మేల్కొనకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని పలువురు అంటున్నారు.

కేసీఆర్ మాట నిలబెట్టుకోవాలి..

కల్తీకల్లు‌తో సామాన్య ప్రజలు రక్తమాంసాలతో వ్యాపారులు ఆటలాడుతున్నారు. వీరి పట్ల ఎక్సైజ్ అధికారులు తమకు పట్టనట్లు వ్యవరిస్తున్నారు. కల్తీకి పాల్పడేవారి పై పీడీ యాక్ట్ కేసులు పెడతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఆ మాటను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌లు నిలబెట్టుకోవాలి. కల్తీ కల్లు తయారు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలి.

– లోక్‌సత్తా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు

Tags: Illegal, Palm wine, making, covid 19 effect, lock down, corona virus, excise police

Advertisement

Next Story