ఇందూరులో ఇల్లీగల్​ లీడర్లు వీళ్లే

by  |
ఇందూరులో ఇల్లీగల్​ లీడర్లు వీళ్లే
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జనం నుంచి వచ్చిన వారిని, జనం మెచ్చిన వారిని జననేత.. ఒకప్పటి మాట. డబ్బుండి, అంగబలాన్ని కలిగి ఉన్నవాడే లీడర్.. ఇప్పటి మాట. ​గ్యాంగ్ లను పోషిస్తూ పార్టీ క్యాడర్ లను కాపాడుకుంటూ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు నిజామాబాద్​ లీడర్లు. అక్రమంగా పోగేసిన డబ్బుతో అందలాలు ఎక్కుతూ అడ్డదారుల్లో పదవులు అనుభవించాలనే ప్రయత్నంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. నేడు లీడర్లుగా చలామణి అవుతున్న వారిలో చాలామంది దశాబ్దాలుగా జిల్లాకేంద్రంలో అనైతిక కార్యకలాపాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నవారే. నిజామాబాద్ నేర చరిత్రను పరిశీలిస్తే నేడు ఆయా పార్టీల్లో పదవులు అనుభవిస్తున్న ఎందరో నేతలు కనిపిస్తారు. గల్లీ స్థాయి నుంచి రాష్ర్టస్థాయి వరకు ఎదిగిన నేతలు ఒకప్పుడు ఇల్లీగల్​ దందాలు చేసి ఎదిగిన వారే అనే విషయాలు బయటపడుతున్నాయి.

నిషేధిత, అక్రమ దందాలతోనే

కష్టపడి సంపాదించి నాయకులుగా ఎదగడం కష్టమనుకున్నవారు, వారసత్వంగా వచ్చిన ఆస్తులు లేనివారే ఎక్కువగా ఇల్లీగల్​ దందాలకు పాల్పడినట్టు తెలుస్తున్నది. న్యాయబద్దంగా సంపాదించడం అతి కష్టంగా భావించిన వారు చట్టవ్యతిరేక దందాలకు దిగి అక్రమంగా సంపాదించారు. అడ్డమైన దారుల్లో పోగేసిన సొమ్ముతో అనతి కాలంలోనే రాజకీయ నాయకులుగా ఎదిగి పదవుల్లో కులుకుతున్నారు. నిజామాబాద్ నేర చరిత్ర పుటలు తిరగేస్తే ఎక్కువగా కలప స్మగ్లింగ్​, మట్కా, పేకాట అడ్డాల నిర్వహణ, గంజాయి వంటి వాటితో పాటు హవాల రూపంలో అక్రమంగా డబ్బు రవాణా, క్లోరోపాం రవాణా పాటు దశాబ్దకాలం కిందటే నిషేధించిన గుట్కా, తంబాకు ఉత్పత్తుల తయారీ, అక్రమంగా విక్రయాలు చేయడం ఆయా లీడర్లకు వెన్నతో పెట్టిన విద్య. కొంత మందిని పోగేయడం వారితో దందాలు ఎలాంటి అడ్డూ అదుపు లేకుండా కొనసాగించుకోవడం వారికి తేలికైన పని. కలప స్మగ్లింగ్ తో పాటు గంజాయి దందాలో నిజామాబాద్​లో తరుచూ పీడీ యాక్ట్​ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

ఇక, గుట్కా, తంబాకు దందాలో రాష్ర్టస్థాయిలోనే జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అధికారం, విపక్షం అని తేడా లేకుండా అన్ని పార్టీల వారూ ఈ దందాలు పీకల్లోతుల్లో మునిగిపోయారంటే అతిశయోక్తి కాదేమో. అలాగే, సీజ్​ చేసిన విలువైన కార్ల అక్రమ అమ్మకాలు కూడా నిజామాబాద్​లో దాదాపు మూడు సంవత్సరాలుగా జోరుగా సాగుతున్నది. ముఖ్యంగా ఇతర రాష్ర్టాల్లో రిజిస్ర్టేషన్​ అయిన విలువైన వాహనాలు ఇక్కడి అతి సామాన్యుల వద్ద కనిపించడం ఆలోచించాల్సిన విషయం. ఆయా రాష్ర్టాల్లో సీజ్​ అయిన కార్లు, దొంగిలించబడిన వాహనాలు దర్జాగా జిల్లా రోడ్లపై దూసుకెళ్తున్నాయి. తాజాగా జిల్లాలో ఈ నెలలో హైద్రాబాద్ నుంచి అక్రమంగా తీసుకొచ్చి విక్రయించిన కోటి రూపాయల విలువైన బైక్​ల దొంగతనం కేసులో జిల్లాకు చెందిన లీడర్ల హస్తం ఉందనే విషయం ఇక్కడి చీకటి దందాను బహిర్గతం చేస్తున్నది. కల్తీ కల్లు తయారీలో క్లోరోపాం వాడకం కూడా జిల్లాలో ఎక్కువే. గుజరాత్​, ముంబయ్​, కర్నాకట, హైదరాబాద్​లనుంచి తరలించిన క్లోరోఫాంతో కల్తీకల్లు తయారు చేస్తున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

వైట్ కాలర్ మోసాల కన్నా.. ఇల్లీగల్ దందాల కేసులే ఎక్కువ

జిల్లాలో వైట్ కాలర్ కేసులకన్నా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినవే ఎక్కువ కేసులు ఉన్నాయి. పోలీసుల రికార్డులు కూడా అదే చెబుతున్నది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు ఇప్పుడు కోట్లకు పడగెత్తారంటే వ్యాపారం ఎంతలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో బలం చూపించుకుని నాయకులుగా ఎదిగే స్థాయికి చేరారు. దశాబ్దాలుగా ఖద్దరు మాటున గలీజ్​ దందాకు పాల్పడుతూ అమాయకులకు డబ్బులు ఎరవేసి కేసులు తమపైకి రాకుండా దర్జాగా తిరుగుతున్నారు. జిల్లా రాజకీయ చరిత్ర చూస్తే ఎక్కువగా పాత నేరస్తులు, పీడీ యాక్టులు, రౌడీషిట్​ఉన్న నాయకులే ఎక్కవగా కనిపిస్తారంటే అతిశయోక్తి కాదు.



Next Story