ఘోరం.. 8 కి.మీ. దూరానికి రూ. 15 వేల కిరాయి

by  |
ఘోరం.. 8 కి.మీ. దూరానికి రూ. 15 వేల కిరాయి
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. శవాలపై కాసుల బేరమాడుతున్నారు. కరుణ చూపాల్సిన చోట కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. అత్యవసరాన్ని ఆసరాగా మల్చుకొని దోపిడీకి తెగిస్తున్నారు. ప్రజల అవసరాన్ని అత్యాశతో సొమ్ము చేసుకుంటున్నారు. ఇది గ్రేటర్ హైదరాబాద్ లో ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల ఆగడాలు.. కరోనా కష్టకాలంలో అందరూ ఉపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉంటే వారు మాత్రం ఇదే అదనుగా భావించి కరోనా బాధితుల నుంచి ఒకటికి పదింతలు ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ లో గాంధీ, టిమ్స్, కింగ్ కోఠి, ఉస్మానియా తదితర ప్రభుత్వ దవాఖానలతోపాటు కార్పొరేట్ ఆస్పత్రులకు కొవిడ్ చికిత్సలు చేసే అవకాశం ఇచ్చారు. దీంతో ఆ ప్రాంతాల్లోనే ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు అత్యధికంగా తిష్టవేశారు. స్థానిక అంబులెన్స్ లతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న వాటిని అద్దెకు తీసుకుంటున్నారు. ఇలా దాదాపు 550కి పైగా ప్రైవేటు అంబులెన్స్ లు ఉన్నట్లు అంచనా. ఈ అంబులెన్సులన్నీ ఆయా ఆస్పత్రుల వద్దే చక్కర్లు కొడుతుంటాయి. కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఆసుపత్రిలో ప్రయత్నాలు జరుగుతున్నాయంటే క్షణాల్లో ఆ సమాచారం వారికి చేరిపోతుంది. దీంతో అంబులెన్స్ నిర్వాహకులు ఒక్కసారిగా అక్కడ వాలిపోతుంటారు. కరోనా బాధితులతో బేరం మొదలుపెడుతారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్వాహకులందరూ ఒకే రేటు నిర్ణయిస్తున్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే 100 కిలో మీటర్ల లోపల రూ.10 నుంచి రూ.15వేలు, 150 కిలో మీటర్ల లోపు అయితే రూ.20 వేలకుపైగా ఇలా బాధితుల అవసరాలను బట్టి జేబులు గుల్ల చేస్తున్నారు.

చనిపోతే మరీ దారుణం

కరోనా బాధితుడు చనిపోతే ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు మరీ కర్కషంగా వ్యవహరిస్తున్నారు. కొవిడ్​తో ఎవరైనా చనిపోతే చూసేందుకు సైతం బంధు,మిత్రులు ముందుకు రావడం లేదు. ఈ కారణాలను సాకుగా చూపుతూ.. కాసుల దండుకుంటున్నారు. వారి ధన దాహానికి పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. హైదరాబాద్ లో కరోనా పేషెంట్ చనిపోతే ఐదారు కిలో మీటర్ల దూరానికైతే రూ. 10 వేలు, 20 కిలో మీటర్ల లోపు మృతదేహాన్ని తీసుకెళ్తే రూ.20 వేలు, శివారు ప్రాంతాలకు 50 కిలో మీటర్ల లోపు దూరం వెళ్లితే రూ.25 నుంచి రూ.30 వేల వరకు 100 కిలో మీటర్లు, ఆ తర్వాత దూరం వెళ్లాలంటే రూ.40 వేల నుంచి పేషెంట్ పరిస్థితిని బట్టి డబ్బులు గుంజుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

ప్రేక్షక పాత్ర..

అంబులెన్స్ నిర్వాహకులు కరోనా బాధిత కుటుంబాల నుంచి వేలాది రూపాయలను దోచుకుంటున్నా.. పట్టించుకునే నాథుడే లేడు. ఈ విషయంలో అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహిస్తోందని విమర్శలు ఉన్నాయి. కరోనా కాలంలో నాలుగున్నర నెలలుగా అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. పనిలేక, జీతాల్లేక అల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల దోపిడీకి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

మచ్చుకు కొన్ని ..

మెదక్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని గాంధీ నుంచి మెదక్ తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు రూ.40 వేలు డిమాండ్ చేశారు. చివరికి కుటుంబ సభ్యులు బతిమిలాడి రూ.35వేలు బేరం కుదుర్చుకున్నారు. పేదరికం వల్లనే గాంధీ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స పొందినా..శవాన్ని తరలించేందుకు బాధితుడి కుటుంబ సభ్యులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఓ డ్రైవర్ కరోనా బారిన పడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతు చనిపోయాడు. గాంధీ నుంచి కేవలం 8 కిలో మీటర్ల ఉన్న తిరుమలగిరికి అతని మృతదేహాన్ని తరలించేందుకు రూ.15వేలు డిమాండ్ చేశారు. బాధితులు కాళ్లవేల్లా పడితే రూ.12 వేలకు అంబులెన్స్ ను పంపేందుకు ఒప్పుకున్నాడు. ఇలా ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుల దోపిడీతో సామాన్యులు అల్లాడిపోతున్నారు.


Next Story

Most Viewed