ఎనిమిది నెలల కనిష్ఠానికి పారిశ్రామిక ఉత్పత్తి సూచీ!

by Harish |
Industrial
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది పండుగ సీజన్ నేపథ్యంలో డిమాండ్ పుంజుకున్నప్పటికీ అతిపెద్ద తయారీ విభాగం మందగించడంతో అక్టోబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ) 3.2 శాతానికి క్షీణించింది. గతేడాది ఇదే నెలలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో 4.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగం పండుగ సీజన్ సమయంలో మెరుగ్గా కొనసాగకపోవడంతో ఐఐపీ సూచీ ఎనిమిది నెలల కనిష్ఠానికి పడిపోయిందని ప్రభుత్వ గణాంకాలు శుక్రవారం వెల్లడించాయి.

ముఖ్యంగా తయారీ విభాగంలో చిప్‌ల కొరత వల్ల పరిశ్రమ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొందని గణాంక కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ) 3.1 శాతంగా నమోదైంది. గణాంకాల ప్రకారం.. అక్టోబర్ నెలలో మైనింగ్ ఉత్పత్తి 11.4 శాతం పెరగ్గా, తయారీ రంగం 2 శాతం వృద్ధి నమోదు చేసింది. సమీక్షించిన నెలలో విద్యుత్ ఉత్పత్తి 3.1 శాతంగా ఉంది. ముఖ్యంగా గత ఏడాది తక్కువ బేస్ ఎఫెక్ట్ కారణంగా గత కొన్ని నెలల్లో పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదల సూచిస్తోంది. అక్టోబర్ నెల ఐఐపీ గణాంకాలను పరిశీలిస్తే బేస్ ఎఫెక్ట్ ప్రభావం తగ్గుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, ఈ ఏడాది ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో ఫ్యాక్టరీ ఉత్పత్తి గత ఏడాది ఇదే కాలంలో 17.3 శాతంగా ఉండగా, ఈసారి 20 శాతానికి పెరిగింది.

Advertisement

Next Story