ఛార్జీలు పెంచినా.. అప్పు పూడ్చడమెట్లా..?

by Anukaran |   ( Updated:2021-12-02 22:30:11.0  )
ఛార్జీలు పెంచినా.. అప్పు పూడ్చడమెట్లా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీలో అసలు సమస్య ముందుకొచ్చింది. బస్సు చార్జీల పెంపునకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. నేడో, రేపో సీఎం నుంచి ఆమోదం కూడా వస్తుందని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. దీంతో పెరిగిన డీజిల్​ధరలకు అనుగుణంగా ఎంతో కొంత రాబట్టుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం రూ.800 నుంచి రూ.1000 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఆశిస్తున్నారు. ఇదంతా ఒకవైపు ఉంటే.. పాత నష్టాలు, అప్పులు తీర్చడం సవాల్‌గా మారింది. ఇప్పటికే ఆర్టీసీ అప్పులు రూ.5 వేల కోట్లు దాటాయి. ఇదంతా నష్టం రూపంలో ఆర్టీసీపై గుదిబండగా మారింది. అదే విధంగా కార్మికులకు చెల్లించాల్సిన సీసీఎస్​బకాయిలు రూ.900 కోట్లకు చేరాయి. ఇది ఎప్పుడైనా చెల్లించాల్సిందే. ఈ నేపథ్యంలో పాత కష్టాల నుంచి గట్టెక్కడంపైనే ఆర్టీసీ దృష్టి పెట్టింది. దీనికి తోడుగా బస్సులు కొనుగోలు చేయాల్సి రావడం ముందున్న మరో కర్తవ్యం.

ఈ ఏడాదితో 2223 బస్సులకు శాశ్వతంగా బ్రేక్​

గత ఏడాదిలో 643 బస్సులు స్క్రాప్​అయినట్లుగా ఆర్టీసీ చైర్మన్​బాజిరెడ్డి గోవర్ధన్​అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. మరో 1400 బస్సులు అత్యంత దయనీయంగా ఉండటంతో ప్రయాణీకులు ఎక్కడం లేదని ఒప్పుకున్నారు. ఈ బస్సులను పక్కకు పెట్టాల్సిందేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనికి తోడుగా ఈ ఏడాది 823 బస్సుల కాల పరిమితి ముగిసిపోతోంది. ఆర్టీసీ లెక్కల ప్రకారం ఈ నెలాఖరుతో వాటిని బయటకు తీయడానికి వీల్లేదు. ఇప్పటికే ఈ బస్సులు అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. రోడ్ల మధ్యలో ఆగిపోతున్నాయి. కొన్ని స్పేర్​పార్ట్స్​వేసినా డిపోల నుంచి బయటకు తీయాలంటే భయపడుతున్నారు. ఇలా ఈ బస్సులను కూడా మార్చాల్సిందే.

ప్రస్తుతం ఆర్టీసీలో 10,460 బస్సులుండగా.. వీటిలో అద్దె బస్సుల సంఖ్య 3,170కి చేరింది. 7,290 ఆర్టీసీ సొంత బస్సులు. వాస్తవంగా 7,290 సొంత బస్సులున్నట్లు లెక్కలు చెప్పుతున్నా.. ఇప్పటి వరకే 4,313 బస్సుల కాల పరిమితి ముగిసింది. అయినా వాటి విడి భాగాలను మార్చి నడుపుతున్నారు. 2019 నుంచి లెక్కేస్తే.. ఈ ఏడాది వరకు 4,313 బస్సుల గడువు తీరిపోయింది. అయినప్పటికీ వీటిని రోడ్డెక్కిస్తున్నారు. కొన్ని బస్సుల విడి భాగాలను ఇతర బస్సులకు వాడుతున్నారు. దీంతో చాలా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఒక్కో బస్సులో పది బస్సుల విడి భాగాలను అమర్చుతున్నారు. దీంతో బస్సు నడుస్తుంటేనే చక్రాలు ఊడిపోతున్నాయి. మంటల్లో కాలిపోతున్నాయి.

ఉమ్మడి వరంగల్​ జిల్లా పరిధిలో ఓ బస్సు అగ్నికి ఆహుతి అయింది. మార్గమధ్యంలో ఉండగానే ఇంజిన్లలో మంటలు వస్తున్నాయి. ఇవన్నీ కాల పరిమితి ముగిసిన బస్సులు కొన్ని ఉంటే.. మరికొన్ని బస్సులు ఆయా బస్సుల విడి భాగాలతో నడుస్తున్నవే కావడం గమనార్హం. 2019లో 2,885 బస్సులు, 2020లో 605 బస్సులు, ఈ ఏడాది 823 బస్సులు కాల పరిమితి ముగిసిపోయింది. వీటిలో ఇప్పటి వరకు 643 బస్సుల వరకు స్క్రాప్​కు తరలించినట్లు ఆర్టీసీ చైర్మన్​ వెల్లడించిన విషయం తెలిసిందే.

కొనడం ఎలా..?

ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఆర్టీసీలో సొంత బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. వీటి స్థానంలో కొత్తవి కొనాలంటే కనీసం రూ.2780 కోట్లు కావాలని ఆర్టీసీ అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. ఏటా సగటున 760 బస్సులు మూలన పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో అద్దె బస్సులను దింపారు. 2019 నుంచి 5100 రూట్లలో ప్రైవేటు ఆపరేటర్లకు పర్మిట్లు ఇచ్చారు. ఇక ఇప్పుడు కొత్త బస్సులు కొనుగోలు చేయకుంటే.. పాత బస్సులను నడుపడం అసాధ్యమే. వాస్తవానికి సంస్థ సొంత బస్సులు చాలా వరకు మూలన పడుతున్నా.. ఆ బస్సుల స్థానంలో అద్దె బస్సులను నడుపుతున్నారు. కొత్త బస్సులను కొనే శక్తి ఆర్టీసీకి లేదంటూ చేతులెత్తేస్తున్నారు. కొత్త వాటిని కొనేందుకు తాము కూడా సాయం చేయలేమంటూ ప్రభుత్వం స్పష్టం చేస్తూనే ఉంది.

ప్రత్యామ్నాయం అంటే..?

ఆర్టీసీ నష్టాలను తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు తప్పనిసరి అంటూ ఆర్టీసీ యాజమాన్యం పదేపదే చెప్పుతోంది. ప్రత్యామ్నాయం అంటే ఏం చేస్తారనేది మాత్రం తేల్చి చెప్పడం లేదు. కానీ ఆర్టీసీ వర్గాల్లో మాత్రం ఆస్తులు అమ్మడం, లేదా లీజుకు ఇవ్వడమే ప్రత్యామ్నాయమంటున్నారు. కానీ ఇప్పటికే ఆర్టీసీ సంస్థ కొన్ని భూములను లీజుకు ఇచ్చింది. వాటి లీజు డబ్బులు రావడం లేదు. కొన్నిచోట్ల అధికార పార్టీకి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు లీజుకు తీసుకుని వ్యాపారాల్లో నష్టాలను చూపిస్తూ ఎగవేస్తున్నారు. అయితే గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్​ వరకు రూ.2,330 కోట్ల నష్టం వచ్చిందని, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రూ.1,440 కోట్ల నష్టం వాటిల్లిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్​ వెల్లడించారు.

2014 నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ నష్టం రూ. 6 వేల కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సంస్థ మొత్తంగా రూ. 6,846 కోట్ల అప్పుల్లో ఉన్నట్లు నివేదికల్లో ప్రభుత్వానికి వివరించినట్లు సమాచారం. రాయితీల కింద రూ.2 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని ఆర్టీసీ యాజమాన్యం నివేదించినట్లు తెలుస్తోంది. 2014-15 నుంచి 2018-19 వరకు వివిధ వర్గాలకు కల్పించిన రాయితీల కింద ఆర్టీసీకి ప్రభుత్వం రూ.2766.84 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటిలో గతేడాది రూ.700 కోట్లు విడుదల చేయగా.. మరో రూ.748.79 కోట్లను వేతనాలకు, ఇతర రూపంలో సర్దుబాటు చేసింది. అయితే 2020 నుంచి ఈ రెండేండ్ల కాలంలో రాయితీ సొమ్ము ఇవ్వలేదు. దీంతో సర్కారు బాకీ రూ. 2వేల కోట్లకు చేరింది.

ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకుల నుంచి ఆర్టీసీ రూ. 2279 కోట్ల అప్పు తీసుకుంది. ఇదికాకుండా ఆర్టీసీ తీసుకున్న అప్పు రూ. 2421 కోట్లు. ప్రస్తుతం ఆర్టీసీపై మొత్తం అప్పు రూ.4700 కోట్లకు చేరింది. ఈ అప్పుపై ఆర్టీసీ ఏటా రూ. 210 కోట్ల వడ్డీ చెల్లిస్తోంది. ఇవి కాకుండా ఉద్యోగుల సీసీఎస్​కు ఇంకా దాదాపు రూ. 900 కోట్లు కావాలి. ఈ ఏడాదిలో తొలి ఆర్థిక సంవత్సరంలో రూ.1246 కోట్ల నష్టం వచ్చింది. ఈ లెక్కల ప్రకారం ఆర్టీసీ మొత్తంగా రూ.6,846 కోట్ల లోటుతో నడుస్తోంది. దీన్ని ఎలా సర్దుబాటు చేస్తారనేదే ఇప్పుడు సంస్థ తరుఫున తేల్చాల్చిన ప్రశ్న.

Advertisement

Next Story

Most Viewed