గండిపేట నిండిందా.. అధికార మార్పిడి పక్కా..!

by Shyam |   ( Updated:2020-11-11 12:10:54.0  )
గండిపేట నిండిందా.. అధికార మార్పిడి పక్కా..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ చెరువులు నిండితే అధికార మార్పిడి ఖాయమా.. అంటే అవుననే అంటున్నారు గండిపేట చెరువు పరిసరాల్లోని గ్రామాలు గండిపేట, నార్సింగి, వట్టినాగులపల్లి, ఖానాపూర్‌ గ్రామస్తులు. ఇది మూఢ నమ్మకమే కావచ్చు కానీ.. వరుస ఉదాహరణలతో నిజమే అన్నట్లుగా ఆలోచింపజేస్తుందని మాట్లాడుకుంటున్నారు. గతంలో ఈ రెండు చెరువులు నిండినప్పుడు ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌ఆర్ అధికారాన్ని కోల్పోయారని చెప్పుకొస్తున్నారు. వైఎస్‌ఆర్‌.. ప్రాణాలే పోయాయని స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడైనా భారీ వర్షాలకు చెరువులు నిండిన తర్వాత రెండు మూడేళ్లకు అధికార పార్టీకి కష్టకాలం మొదలవుతుందని, 1980లోనూ అదే చోటు చేసుకుందన్న చర్చ గ్రామస్తుల్లో మొదలైంది.

అంతేకాదు.. వీటిలో ఓ గ్రామానికి చెందిన కుంట అలుగు పోసిన ప్రతిఏటా రెండు ప్రాణాలు పోవడం ఖాయం. ఈఏడాది కూడా గ్రామస్తులు ఇద్దరు మరణించారు. అంతేకాదు.. లెక్కలేసుకొని జర్నలిస్టులు సైతం అదే చెబుతున్నారు. యాధృచ్చికమే కావచ్చు.. లేదంటే జాతక ఫలాలే కావచ్చు. కానీ వరుసగా జరిగిన ఉదంతాలతో ప్రచారం ఊపందుకుంది. అధికార పార్టీ సభ్యులెంత మంది ఉన్నా.. ఎన్టీఆర్ అధికారాన్ని కోల్పోయారని..ఆ తర్వాత చంద్రబాబు నాయుడు సైతం జనంలో పెద్దగా బలం ఉందనుకున్నా అధికారం దక్కలేదు. ఆయన సీఎంగా కొనసాగిన చాలాకాలం అనావృష్టి సంభవించింది. ఆ తర్వాత వైఎస్‌కు పెద్దగా బలం ఉన్నప్పటికీ భారీ వర్షాలకు దురదృష్టవశాత్తు మరణించారు.

అధికార మార్పిడి జరిగిన ప్రతిసారి ఈ రెండు చెరువుల నీటి మట్టాలకు ముడి పడి ఉంది. ఎప్పుడెప్పుడు అధికారం మారిందో.. దానికి రెండు, మూడేండ్ల నీటి మట్టాలను పరిశీలిస్తే నిజమేననిపిస్తుందని స్థానిక రిపోర్టర్లు, నాయకులు అంటున్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు రెండు చెరువుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఈ క్రమంలోనే గత ఉదంతాలపై మాట్లాడుకుంటున్నారని ఆయా గ్రామాలవాసులు ముచ్చటించుకుంటున్నారు. ఇదంతా ట్రాష్.. ఒట్టి మూఢనమ్మకమేనని కొట్టి పారేయొచ్చు. కానీ ఆయా గ్రామాల్లో టాక్ మాత్రం ఇదే.

Advertisement

Next Story