సోషల్ డిస్టెన్స్ అతిక్రమిస్తే జైలుకు పంపండి: కలెక్టర్ నారాయణరెడ్డి

by vinod kumar |
సోషల్ డిస్టెన్స్ అతిక్రమిస్తే జైలుకు పంపండి: కలెక్టర్ నారాయణరెడ్డి
X

దిశ, నిజామాబాద్: జిల్లాలో ఇకమీదట ఎవరైనా లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే వారిని జైలుకు పంపించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం పీహెచ్‌సీ స్థాయి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులతో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా భయంతో ప్రైవేట్ ఆస్పత్రులు సైతం మూసివేశారని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది ఎంతో ధైర్యంగా విధులు నిర్వర్తించడం గొప్ప విషయమన్నారు. తమ ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా రిస్క్ తీసుకుని పని చేస్తున్నారని, అంతేకాకుండా కంటైన్‌మెంట్ జోన్లలో తిరుగుతూ బాధితుల వివరాలు సేకరిస్తున్నారన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మున్సిపల్ సిబ్బందితో మాట్లాడినప్పుడు వారిలో ఎంతో మనోధైర్యం కనిపించిందని జిల్లా పాలనాధికారి వివరించారు. మనదేశంలో బీసీజీ వాడటం వల్ల కరోనా వ్యాప్తి తక్కువగా ఉందని, దీనిని లక్ష్యానికి అనుగుణంగా కొనసాగించాలన్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు మరింత మెరుగుపరచాలని అధికారులను కోరారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ, సెకండరీ వ్యక్తుల్లో అనుమానంగా ఉన్న వారి శాంపిల్స్ తీసుకుని పరీక్షల కోసం పంపించాలన్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినా, మాస్కులు ధరించకపోయినా, లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించినా కేసులు నమోదు చేసి, అవసరమైతే జైలుకు పంపించాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ లత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సుదర్శన్, ఆర్డీవోలు మున్సిపల్ కమిషనర్లు, వైద్య శాఖ సిబ్బంది, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags: corona,if any one break, lockdown rules, sent to jail, order by collecto



Next Story

Most Viewed