జూలై ఆఖరి నాటికి ఐసీసీకి కొత్త చైర్మన్

by  |
జూలై ఆఖరి నాటికి ఐసీసీకి కొత్త చైర్మన్
X

దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ శశాంక్ మనోహర్ పదవీకాలం తీరిపోవడంతో కొత్త చైర్మన్‌ను ఎన్నుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ఐసీసీ బోర్డు సభ్యులు కొత్త చైర్మన్‌ను ఎన్నుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ జూలై మొదటి వారంలో ప్రారంభించి, నెలాఖరు లోపు కొత్త చైర్మన్‌ను ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఐసీసీ బోర్డులోని సభ్యులకు మాత్రమే చైర్మన్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం బోర్డులో 12 దేశాల ప్రతినిధులు, ఒక స్వతంత్ర డైరెక్టర్, సీఈవో సభ్యులుగా ఉన్నారు. ఎన్నికలు జరిగితే సీఈవోకు ఓటు హక్కు ఉండదు. అయితే, ఐసీసీ ఎంఓఏను మార్చి అసోసియేట్ దేశాలైన 104 మందికి ఓటు హక్కు కల్పించాలనే చర్చ జరుగుతున్నది. వీరందరికీ ఓటు హక్కు ఇవ్వాలంటే ఇప్పటికిప్పుడు ఐసీసీ రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. కానీ, మరో నెలలోపు ఇది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఈ దఫా పాత పద్ధతినే అనుసరించాలని ఐసీసీ భావిస్తున్నది. ఇక ఐసీసీ చైర్మన్ రేసులో ఈసీబీ మాజీ అధ్యక్షుడు కొలిన్ గ్రీవ్స్ ముందంజలో ఉన్నారు. ఒకవేళ బీసీసీఐ తరఫున సౌరవ్ గంగూలీ బరిలోకి దిగితే సమీకరణలు మారిపోయే అవకాశం ఉంది.


Next Story