వివాదంలో దాసరి కుమారుడు.. కులం పేరు చెప్పి బెదిరింపు..

by Shyam |   ( Updated:2021-08-17 22:38:06.0  )
వివాదంలో దాసరి కుమారుడు.. కులం పేరు చెప్పి బెదిరింపు..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు చిన్న కుమారుడు దాసరి అరుణ్‌కుమార్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే తండ్రి బతికి ఉన్నప్పుడు ఆస్తుల విషయంలో వివాదస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన అరుణ్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయనపై బాధితుడు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన డబ్బులు తిరిగి చెల్లించమని అడిగితే తనను కులం పేరుతో అరుణ్ దూషించాడని బాధితుడు ఫిర్యాదు లో పేర్కొన్నాడు. దీంతో అరుణ్ పై పోలీసులు ఐపీసీ 504, 506, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారానికి చెందిన బ్యాగరి నర్సింహులు వెంకటేష్‌ అనే టెక్నీషియన్‌ దాసరి నారాయణరావు వద్ద మూవీ రిస్టోరేషన్‌ ఔట్‌సోర్సింగ్‌ పనులు చూసుకునేవాడు. అప్పుడే దాసరి కుమారులు అరుణ్, ప్రభు పరిచయమయ్యారు. ఆ సమయంలోనే అతనితో అరుణ్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దాసరి మరణించిన అనంతరం పాత ఒప్పందం రద్దు చేసి కొత్త ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకు సరే అన్న వెంకటేష్.. ఇటీవల తన డబ్బులు తిరిగి చెల్లించవల్సిందిగా అరుణ్ ని కోరారు.

ఈ విషయమై మాట్లాడాలని చెప్పి తనను ఎఫ్‌ఎన్‌సీసీకి రమ్మని చెప్పారని, చక్రపాణి అనే మరో వ్యక్తిని తీసుకొని అక్కడికి వెళితే అరుణ్ ఇష్టం వచ్చినట్లు తిట్టాడని బాధితుడు పేర్కొన్నాడు. తనను కులం పేరుతో దూషించాడని, నీ అంతు చూస్తానంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అరుణ్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని తెలుపుతూ ప్రాణ రక్షణ కల్పించాలంటూ పోలీసులను కోరాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారం చేపట్టారు.

Advertisement

Next Story