నర్సులు.. నెర్వస్

by Shyam |
నర్సులు.. నెర్వస్
X

దిశ, హైదరాబాద్: వైద్యరంగంలో రోగులకు సేవలందించడంలో నర్సుల పాత్ర కీలకం. ఈ వృత్తిలో అత్యధికంగా మహిళలే ఉండటంతో మనం ఎంతో ఆత్మీయంగా సిస్టర్ అని సంబోధిస్తుంటాం. కానీ, ప్రస్తుతం ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్ సవాలు విసురుతున్నా యావత్ వైద్య బృందాలు పోరాడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవాళ్లకు సేవలు చేసే నర్సులు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి.

కనీస సౌకర్యాలు శూన్యం

వైద్య వృత్తిలో సేవలు అందించే వారికి కనీస రక్షణ చర్యలు అవసరం. అలాంటి సదుపాయాలు ఉంటేనే విధులు నిర్వర్తించేందుకు సిద్ధం అవుతారు. అసలే ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న కరోనా వైరస్ సోకిన బాధితుల వద్ద పనిచేయాలంటే ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి పరిస్థితులో నర్సులకు ప్రభుత్వం, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు కనీస రక్షణ కల్పించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రజెంట్ కరోనా బాధితులకు ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసిన ఓ ఆస్పత్రిలో తమకు కనీస సదుపాయాలు కల్పించాలని నర్సులంతా ఉన్నతాధికారికి కలిసి లేఖ రాశారంటే పరిస్థితులు ఎలా అర్థం చేసుకోవచ్చు.

ఉద్యోగాలు మానేయాలని ఒత్తిడి

ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే నర్సులకు కరోనా నివారణకు కావాల్సిన కనీస సదుపాయాలను సమకూర్చట్లేదనే విమర్శలున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కరోనా వార్డుల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఎలాంటి భరోసా, భద్రత లేని ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేయాల్సిన అవసరం ఉందా అంటూ కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో నర్సులు ఆస్పత్రి నుంచి ఇంట్లోకి రాగానే సొంత కుటుంబ సభ్యులే జాగ్రత్తలు తీసుకుంటుండడంతో నర్సులు ఉద్యోగాలు మానేసేందుకు సిద్ధం అవుతున్నారు.

Advertisement

Next Story