ఎమ్మెల్సీ బరిలో మేయర్!

by  |
ఎమ్మెల్సీ బరిలో మేయర్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్ ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. దీంతో ఆయనకు టికెట్ దాదాపుగా ఖరారు అయినట్లేనని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. ఆయన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. మల్కాజిగిరి ఎంపీ స్థానానికి పోటీ చేసిన మర్రి రాజశేఖర్‌రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నప్పటికీ, పార్టీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. పట్టభద్రుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నందున గెలుపు మీది ఆశతో దాదాపు డజను మంది కాంగ్రెస్ నేతలు పోటీకి సిద్ధమవుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ నేత రాంచందర్‌రావు క్షేత్రస్థాయి పర్యటనలపై దృష్టి పెట్టారు. ఇదే పార్టీ నుంచి ఎన్నం శ్రీనివాసరెడ్డి కూడా పోటీ చేయాలకుంటున్నారు. ఈసారి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థి దేవీ ప్రసాద్ 13 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రవికుమార్ గుప్తాకు డిపాజిట్ కూడా దక్కలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుస విజయాలను సాధించిన టీఆర్ఎస్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. దేవీప్రసాద్, పాతూరి సుధాకర్ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, పూల రవీందర్ అధికార పార్టీ మద్దతు ఉన్నప్పటికీ ఓడిపోయారు.

ఉద్యమ నేపథ్యంతో…

ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ పదవి మహిళకు రిజర్వు కావడంతో బొంతు రామ్మోహన్‌కు మళ్ళీ పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవి మీద దృష్టి పెట్టారు. పట్టభద్రుల నియోజకవర్గంలో రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలు ఉన్నప్పటికీ చాలా ప్రాంతం హైదరాబాద్ నగరంలో కలిసే ఉండడం, మేయర్‌గా ప్రజల్లో ఆదరణ ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశాలనేది టీఆర్ఎస్ అభిప్రాయం. దీనికి తోడు యువకుడు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలో విద్యార్థి నాయకుడిగా ఉన్నందున ఆ పరిచయాలు, విద్యార్థుల ఓట్లు ఆకర్షించే అవకాశం ఉందనేది కూడా పార్టీ భావన. జీహెచ్ఎంసీ మేయర్ పదవీ కాలం ఫిబ్రవరితో ముగుస్తోంది. అప్పటికి ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కూడా వెలువడుతుంది.

కాంగ్రెస్లో పెరిగిన పోటీ..

ఏడాది కింద కరీంనగర్ ఎమ్మల్సీ ఎన్నికలలో టి. జీవన్‌‌రెడ్డి గెలుపును దృష్టిలో పెట్టుకున్న చాలా మంది కాంగ్రెస్ నేతలు ఈసారి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత తమను గెలుపు దిశగా నడిపిస్తుందనే భరోసా ఇందుకు కారణం. గతంలో ప్రజాదరణ ఉన్నప్పటికీ దేవీప్రసాద్ ఓడిపోవడం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పాతూరి సుధాకర్ రెడ్డి ఓటమిని కూడా బేరీజు వేసుకుంటున్నారు. దీంతో మహిళా నేత ఇందిరా శోభన్, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సంపత్, వంశీచంద్, రామ్మోహన్ రెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, తెలంగాణ పీఆర్‌టీయూ వ్యవస్థాపకుడు హర్షవర్ధన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, న్యాయవాది వెంకటశ్ తదితరులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. సమర్థత ఆధారంగానే కాంగ్రెస్ నాయకత్వం అభ్యర్థిని ఎంపికచేసే అవకాశం ఉంది.

టీఆర్ఎస్ సన్నాహకాలు..

ఉద్యమ ప్రభావం ఉవ్వెత్తున ఉన్నా, ఎన్జీవో నాయకుడిగా తగిన గుర్తింపు ఉన్నా గతంలో దేవీప్రసాద్ ఓడిపోవడం టీఆర్ఎస్‌ను విస్మయానికి గురిచేసింది. దానిని గుణపాఠంగా తీసుకుని ఓటర్లను ఆకట్టుకోవడానికి సన్నాహక సమావేశాలను నిర్వహిస్తోంది. సమావేశాలకు వందలాది మంది హాజరవుతున్నప్పటికీ వారిలో గ్రాడ్యుయేట్లు మాత్రం పదుల సంఖ్యలో కూడా ఉండడం లేదని అంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రధాన దృష్టి ఉన్నందున ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధానంగా ఫోకస్ లేదు. ఎమ్మెల్యేలతోనే సమావేశాలు నడిపిస్తున్నారు. మున్ముందు ఎమ్మెల్సీ గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. సన్నాహక సమావేశాలకు వచ్చే జనాల్లో పట్టభద్రులు తక్కువగా ఉన్నందున నష్టమేమీ లేదని కాంగ్రెస్, బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ఐదు లక్షలకు చేరనున్న ఓటర్ల జాబితా?

గత ఎన్నికల సమయానికి రెండున్నర లక్షలు ఉన్న ఓటర్ల సంఖ్య ఈసారి బాగా పెరిగే అవకాశం ఉంది. కొత్త ఓటర్ల నమోదుపై ఇప్పటివరకూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. గడచిన ఐదేళ్లలో డిగ్రీ పూర్తి చేసినవారి వివరాలను సేకరించడంపై అన్ని పార్టీలూ దృష్టి పెట్టాయి. ఈ మూడు పార్టీలకూ వాటివాటి వ్యూహాలు, అంచనాలు వేర్వేరుగా ఉన్నాయి. నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పన, నియామకాలు, ఖాళీ పోస్టుల భర్తీ, కాంట్రాక్టు-ఔట్‌సోర్సింగ్ విధానాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు.. ఇలా అనేకం ఈసారి ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రాలుగా ఉండనున్నాయి.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed