- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భాగ్యనగరంలో ఐరన్ స్క్రాప్‌తో అందమైన శిల్పాలు!
దిశ, ఫీచర్స్ : పాత సామాన్ల దుకాణంలో వృథాగా పడిఉన్న నట్లు, బోల్టులు సహా ఎన్నో ఇనుప వస్తువులు అతడి చేతిలో చక్కని రూపంగా ఒదిగిపోతాయి. ఓ శిల్పం రెక్కలు కట్టుకుని ఎగిరిపోతే, మరో ఆకృతి ల్యాప్‌టాప్‌లో పనిచేసుకుంటూ కనువిందు చేస్తోంది. పరుగులు తీసే గుర్రం, ఆకాశానికి ఎగరాలని ఆరాటపడే మనిషి వంటి ఆకారాలెన్నో చూపరులను ఆకర్షిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన ధీరజ్.. భాగ్యనగరంలో తన కళా ప్రతిభను చాటుకుంటున్నాడు.
హైదరాబాద్ శివారు ప్రాంతమైన గోపన్‌పల్లి వైపు వెళ్లే వాహనదారులు ఐరన్ స్క్రాప్‌తో రూపొందించిన గుర్రపు శిల్పాన్ని చూసి ముచ్చటపడుతున్నారు. ధీరజ్‌కు చెందిన స్కల్ప్ ఆర్ట్ హౌస్-కమ్-స్టూడియో బయట 300 కిలోల బరువు గల ఈ కళాకృతి కొలువుతీరింది. 250-గజాల స్టూడియో ప్రాంగణాన్ని అతిపెద్ద శివలింగంతో కళాత్మక ప్రదేశంగా మార్చాలని కలలు కంటున్నాడు. అన్ని వర్గాల ప్రజలు కళను ఆస్వాదించే స్థలాన్ని సృష్టించేందుకు తపన పడుతున్నాడు.
వ్యవసాయాధారిత కుటుంబంలో పుట్టిన ధీరజ్‌కు చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తి. అందుకు అతని తల్లి ప్రోత్సాహం తోడైంది. మార్గనిర్దేశం చేసేవారు ఎవరూ లేకున్నా ఎలాగోలా తానే ‘బనారస్ హిందూ యూనివర్సిటీ’లో సీటు పొందిన ధీరజ్.. తన గ్రామం నుంచి ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ పొందిన తొలి వ్యక్తిగా నిలిచాడు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొంది, ఇక్కడే తన టాలెంట్ నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
‘శిల్పకళలో రాణించాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే నా క్లాస్‌మేట్స్ కొందరు మంచి కళాకారులైనా, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆర్ట్ టీచర్స్‌గా మారారు. కానీ నేను మాత్రం ఇదే రంగంలో సత్తా చాటాలనుకున్నాను. ఈ క్రమంలోనే RBVRR తెలంగాణ పోలీస్ అకాడమీ రాక్ ఇన్‌స్టాలేషన్ రూపొందించే ఆఫర్ వచ్చింది. ఈ స్కల్ప్‌చర్‌ను ఇటాలియన్ శిల్పి మైఖేలాంజెలో కోట్ ఆధారంగా రూపొందించాను. ఆరడుగుల ఎత్తుతో రెక్కలున్న స్త్రీ శిల్పం, చదువుతున్న బాలిక ఉక్కు శిల్పంతో పాటు మరో రెండు శిల్పాలను రూపొందించాను. ఇందుకోసం రాయి, మెటల్, స్క్రాప్, ఇనుము, ఉక్కు ఉపయోగించాను. గుర్రం శిల్పాన్ని పూర్తి చేసేందుకు మూడు నెలలు శ్రమించాను. నేను మట్టి ఇంట్లో పెరిగాను. అందుకే ఆ వాతావరణాన్ని, నా బాల్యాన్ని గుర్తుచేసేలా గోపన్‌పల్లిలో కొంత స్థలాన్ని లీజుకు తీసుకున్నాను’ అని ధీరజ్ చెప్పుకొచ్చాడు.