ఎమ్మెల్యే ఇల్లు కట్టుకోకూడదా.. సైదిరెడ్డి ఆగ్రహం

by Shyam |   ( Updated:2021-07-26 06:31:29.0  )
Huzurnagar MLA Saidi Reddy
X

దిశ, హుజూర్ నగర్: నియోజకవర్గంలో ఎవరు ఫోన్ చేసినా.. ఒక్క ఫోన్ కాల్‌తో స్పందిస్తానని, గ్రామాలలో సర్పంచులు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ప్రజలు నేరుగా తనకే కాల్ చేస్తున్నారని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. సోమవారం హుజూర్‌నగర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో జయశ్రీ అధ్యక్షతన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ… తాను స్థానికంగా ఉన్నచోట సొంతంగా ఇల్లు కట్టుకోవడం కూడా కొందరికి తప్పుగా కనిపిస్తోందని విమర్శించారు. 2019 ఎన్నికల రిజల్ట్ రాగానే హుజూర్ నగర్‌లో నూతన గృహా నిర్మాణానికి శంఖుస్థాపన చేశామని గుర్తుచేశారు. చౌకబారు విమర్శలకు భయపడేది లేదన్నారు. ఎన్ని ఆరోపణలు చేసినా.. అభివృద్ధిలో వెనక్కి తగ్గబోమని వెల్లడించారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.25 కోట్లు కేటాయిస్తే.. రోడ్లు వేయకుండా అడ్డుకుని కోర్టులో కేసులు వేశారని మండిపడ్డారు.

త్వరలోనే మెయిన్ రోడ్లన్నీ మెరిసేలా చేస్తామని హామీ ఇచ్చారు. నిధులు తీసుకురావడంలో పోటీపడాలి కానీ, అభివృద్ధిని అడ్డుకోవడం ఏంటని అన్నారు. ఇప్పటికీ కనీసం రోడ్లులేని గ్రామాలు చాలా ఉన్నాయని, గత ప్రభుత్వాలు చేసిన నిర్వాకం అలాంటిదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా కరోనా టైంలో జనం మధ్యనే ఉన్నామని, ప్రతి ఒక్కరినీ ఆదుకోవడానికి ప్రయత్నం చేశామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక గ్రామాల్లో రోడ్లు వేశామని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ కడియం వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, కౌన్సిలర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story