హుస్సేన్ సాగర్‌లో ఆత్మహత్యల కలకలం.. ఒక్కరోజే ఐదుగురు..

by Shyam |   ( Updated:2021-08-15 06:08:27.0  )
Hussain Sagar as a suicide spot
X

దిశ,తెలంగాణ బ్యూరో : ఏ చిన్న సమస్య వచ్చినా, ప్రేమ వైఫల్యం చెందినా, కుటుంబ సమస్యలు ఉన్నా.. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారికి నగరంలోని హుస్సేన్ సాగర్ అడ్డగా మారింది. సాగర్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఏదో ఓ చోట నిత్యం ఆత్మహత్య ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. హుస్సేన్ సాగర్ దాదాపు 12 నుంచి 14 కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉంది. అయితే ఇందులో దాదాపు 20 సూసైడ్ స్పాట్‌లు ఉన్నాయని కేవలం అప్పర్ ట్యాంక్ బండ్ దగ్గరే 7 స్పాట్లు ఉన్నట్లు లేక్ పోలీసులు తెలిపారు. ఈ స్పాట్లలో దాదాపు నెలకు 30 నుంచి 40 మంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారని, ఇలా ఆత్మహత్యలు చేసుకున్న వారిలో ఎక్కువగా మహిళలే ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

భర్త కొట్టాడనో.. అత్త తిట్టిందనో.. ప్రేమ విఫలమైందనో ఆవేశంలో వచ్చి సాగర్‌లో దూకేస్తుంటారు. ఇలా ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్న వారికి లేక్ పోలీసులు పునర్జన్మిస్తున్నారు. నిత్యం స్పాట్‌లలో పోలీసులను ఉంచుతూ పెట్రోలింగ్ జరుపుతున్నారు. అంతేకాకుండా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో చిరువ్యాపారులను ఇందులో భాగస్వామ్యం చేసి సాగర్‌లో దూకిన వెంటనే సమాచారం తెలుసుకొని రక్షించగలుగుతున్నారు. ఇలా చనిపోయేందుకు నిర్ణయించుకున్న వారిని పోలీసులు కాపాడి వారిలో మార్పు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

అయితే ఇలా సూసైడ్ అటెంప్ట్ చేసిన వారితో ఎంతో జాగ్రత్తగా ఉంటామని పోలీసులు చెబుతున్నారు. వారిని స్టేషన్ కి తీసుకెళ్లి కొన్ని గంటలపాటు వారిని ఎలాంటి ప్రశ్నలు అడగకుండా ఒదిలేస్తామని, కొద్ది సేపటికి వారే పేరు, అడ్రెస్, కుటుంబసభ్యుల మొబైల్ నెంబర్ ఇస్తారని లేక్ పోలీసులు అంటున్నారు. అయితే శుక్రవారం ఒక్క రోజే ఐదుగురు ఒకే చోట వేర్వేరు సమయాల్లో సూసైడ్ అటెంప్ట్ చేశారని, వారిని కూడా రక్షించి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించామని పేర్కొన్నారు. ఎంత అప్రమత్తంగా ఉన్నా రాత్రివేళల్లో జరుగుతున్న సూసైడ్స్‌ని ఆపలేకపోతున్నామని పోలీసులు వాపోతున్నారు. కానీ ప్రస్తుతం రాత్రివేళల్లోనూ లేక్ చుట్టూ కాపల ఉంచేలా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని కోల్పోవద్దని వారు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed