ఇద్దరు భార్యల ముద్దుల మెుగుడు.. వైఎస్సార్ చేయూత డబ్బులు పడలేదని దుర్మార్గం

by srinivas |
Attack that ‘YSR Cheyuta
X

దిశ, ఏపీ బ్యూరో: అతగాడు ఇద్దరు పెళ్లాల ముద్దుల మెుగుడు. ఆ ఇద్దరి భార్యలతో కలిపి ఒకే రేషన్‌కార్డు ఉంది. మెుదటి భార్య, రెండో భార్య, భర్తతో కలిసి రేషన్ కార్డు ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత అనే పథకానికి సంబంధించి రెండో ఏడాది డబ్బులు జమ చేసింది. 40ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.18,750 జమ చేశారు. అయితే మెుదటి భార్య అకౌంట్లో రూ.18,750 జమ కాగా రెండో భార్య అకౌంట్లో పడకపోవడంతో అతగాడు రెచ్చిపోయాడు. బంధువులతో కలిసి గ్రామ వలంటీర్‌ను చితక్కొట్టాడు. ఈ ఘటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలోని ఆయన నియోజకవర్గంలోనే చోటు చేసుకుంది.

పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం చిన్న కూడాల గ్రామానికి చెందిన రామ్మోహన్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. వారికి ఒకే రేషన్ కార్డు ఉంది. ఇద్దరి భార్యలలో ఒకరికి మాత్రమే వైఎస్సార్ చేయూత డబ్బులు అకౌంట్లో జమ అయ్యింది. మరో భార్యకు వైఎస్సార్ చేయూత డబ్బులు పడలేదు. దీంతో రామ్మోహన్ గ్రామ వలంటీర్ దిద్దెకుంట మహేశ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

గ్రామ వలంటీర్ నిర్వాకం వల్లే తన భార్య అకౌంట్లో డబ్బులు జమ కాలేదని భావించాడు. తన బంధువులతో కలిసి వలంటీర్ మహేశ్ పై దాడికి పాల్పడ్డారు. కట్టెలు, రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తనకు, తన కుటుంబ సభ్యులకు రామ్మోహన్ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇకపోతే వలంటీర్ మహేశ్‌కు ఇటీవలే సేవారత్న అవార్డుతో ప్రభుత్వం సత్కరించడం విశేషం.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed