‘గంగ’ను మింగిన ఘనులు..!

by  |
‘గంగ’ను మింగిన ఘనులు..!
X

ఉత్తర తెలంగాణ ప్రజలు “దక్షిణ గంగ” గా పిలుచుకునే గోదావరి నదిపై నిర్మించిన శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్‌లో వందలాది ఎకరాలు ఆక్రమణకు గురవుతున్నాయి. ఇప్పటికే సుమారు వెయ్యి నుంచి 2000 ఎకరాల భూములు ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు ముంపు భూముల్లో కబ్జాదారుల చేతుల్లోకి వెళితే.. అధికార యంత్రాంగానికి అడ్డుకునే ధైర్యం చేయడం లేదు. దీని వెనక ఉన్నతస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ ఆదిలాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (ప్రస్తుత నిర్మల్) పరిధిలోని ముధోల్, బాసర, లోకేశ్వరం మండలాలతో పాటు నిజామాబాద్ జిల్లాలోని సుమారు 70కి పైగా గ్రామాలకు చెందిన రైతుల భూములు ముంపునకు గురయ్యాయి. దీనికి నాలుగు దశాబ్దాల క్రితమే ఈ భూములకు ప్రభుత్వం పరిహారం కూడా చెల్లించింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో వందలాది ఎకరాల భూములపై అక్రమార్కులు కన్నేశారు. పరిహారం చెల్లించినప్పటికీ రైతుల భూములను ప్రభుత్వం మ్యుటేషన్ చేసుకోలేదు. దీంతో వేలాది ఎకరాల భూములు రైతుల పేర్ల పైనే ఉన్నాయి. అయితే పాత రైతుల నుంచి కొనుగోలు చేసినట్లుగా రెవెన్యూ రికార్డులు సృష్టించి అక్రమాలకు పాల్పడుతున్నారు. దీన్ని నిరోధించాల్సిన రెవెన్యూ అధికారులతో పాటు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మూడు మండలాల్లో విస్తరించి ఉన్న ఎస్‌ఆర్‌ఎస్‌పీ బ్యాక్ వాటర్ ముంపు సుమారు వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల దాకా ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎకరం భూమి కనీసం రూ. 10 నుంచి 15 లక్షల మేర పలుకుతున్నది.

బడాబాబులే అక్రమార్కులు..?

శ్రీరాంసాగర్ భూముల ఆక్రమణలు వెనుక పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే యథేచ్ఛగా ఆక్రమించి అనుభవిస్తున్న వారిలో ఉన్నతస్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి కొన్ని ఫిర్యాదులు కూడా వెళ్లాయి. అయినప్పటికీ వీరిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు ముందుకు రావడం లేదు. భూములు సర్వే చేస్తుంటారే తప్ప వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంలేదు. బాసర ప్రాంతానికి చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు ఆక్రమిత భూముల్లో భాగస్వాములని తెలుస్తోన్నది. ఇద్దరు ఉన్నతాధికారులపై ఈ భూముల ఆక్రమణ విషయంలో తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇంకా కొందరు ముంపు భూముల సమీపంలో పట్టా భూములు కొనుగోలు చేసి.. పక్కనున్న భూముల్లో సాగు చేస్తున్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ముంపు భూముల్లో చేపల చెరువులు..?

ఆక్రమించిన భూముల్లో యాభై నుంచి వంద ఎకరాల చేపల చెరువులను అక్రమార్కులు నిర్మించారు. ఇంకా కొందరు భూములు సేద్యం చేస్తూ రెవెన్యూ రికార్డుల్లో ఇంకా పట్టా భూములు గానే చూపుతున్నారని విమర్శలు ఉన్నాయి. కొందరు ఆంధ్ర వ్యాపారులతో చేయి కలిపి చేపల చెరువుల నిర్మాణాలకు పూనుకున్నట్లు తెలుస్తోన్నది. ఈ తతంగం అంతా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ చివరి భూముల్లో సాగుతున్నా.. అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలో ఒకరిపై ఒకరు తప్పును నెట్టు కుంటున్నాయి.

విద్యుత్ కనెక్షన్లు.. రైతుబంధు..!

అసలే ఆక్రమిత భూములు. అందులోనూ ఓ భారీ సాగునీటి ప్రాజెక్టు ముంపు భూములు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి పరిహారం పొందిన భూములు అవి. ఆ భూములను దర్జాగా ఆక్రమించడంతో పాటు రెవెన్యూ రికార్డుల్లో సొంత భూములుగా చూపుతూ అధికార యంత్రాంగానికి సవాల్ విసురుతున్నారు. మరోవైపు విద్యుత్ శాఖను తప్పుదోవ పట్టించి ఆక్రమిత భూముల్లో కరెంట్ కనెక్షన్లు, పంపుసెట్లకు అనుమతి తీసుకున్నారు. కొందరు ట్రాన్స్‌కో అధికారులను సైతం నయానో భయానో ఒప్పించి.. ‘మెప్పించి’ ట్రాన్స్‌ఫార్మర్లు సైతం వేయించుకున్నారు. దీన్ని బట్టి ఈ వ్యవహరం ఏ స్థాయిలో సాగుతుందో అర్థం అవుతున్నది. ఇదిలా ఉంటే ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం డబ్బులు కూడా ఆక్రమిత భూములపై తీసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి.

సీఎం ఆదేశంతోనైనా యంత్రాంగం కదిలేనా..?

సాగునీటి ప్రాజెక్టుల భూములు, బ్యాక్ వాటర్ భూములు, నిర్మాణం పూర్తయిన చెరువుల భూములను ప్రభుత్వం పేరిట మ్యుటేషన్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపు భూముల విషయంలో అమలవుతుందా అన్నది సందేహంగా మిగులుతోన్నది. ఎప్పుడో పరిహారం ఇచ్చిన భూములను దశాబ్దాలుగా ప్రభుత్వం పేరిట మార్చని కారణంగా బ్యాక్ వాటర్ భూములను అక్రమార్కులు అనుభవిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఇలాంటి భూములపై ప్రస్తావించారు. ఆ వెంటనే నిర్మల్ జిల్లా కలెక్టర్ రెవెన్యూ, ల్యాండ్ సర్వే, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు. వెంటనే భూములను ప్రభుత్వం పేరిట మ్యుటేషన్ చేయించాలని ఆదేశించారు. అయితే కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ఇచ్చిన ఆదేశాలు అమలు అవుతాయా..? లేదంటే ప్రభుత్వ భూములు అక్రమార్కుల పరం అవుతాయా అన్నది వేచి చూడాలి..!

బాసర భూములను పరిశీలించిన కలెక్టర్

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో అక్రమ పట్టాలతో అనుభవిస్తున్న భూములను శనివారం నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖ్ సందర్శించారు. ఎస్ఆర్ఎస్పీ అధికారులు సేకరించిన భూములను వెంటనే ప్రభుత్వం పేరిట మ్యుటేషన్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాగా బాసరలో వ్యవసాయ ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని వెలువడుతున్న సమాచారం మేరకు కలెక్టర్ భూముల పరిశీలన జరిపినట్లు తెలుస్తోన్నది. ఆయన వెంట జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా ల్యాండ్ సర్వే అదనపు డైరెక్టర్ దశరథ్, రెవెన్యూ, సర్వే అధికారులు ఉన్నారు.



Next Story