ఆర్టీసీకి 'దసరా' బొనాంజా.. భారీగా ఆదాయం

by Anukaran |
tsrtc
X

దిశ, తెలంగాణ బ్యూరో: దసరా, బతుకమ్మ పండగల సందర్భంగా రాష్ట్ర ఆర్టీసీకి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. పండుగలకు సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిటలాడాయి. ఈ నెల 8 నుంచి 18 వరకు రూ. 111.91 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ ప్రకటించారు. కేవలం టికెట్ల రూపంలోనే ఈ ఆదాయం వచ్చింది. ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలు దోపిడీ చేస్తుండటంతో ప్రజలు ఆర్టీసీనే నమ్ముకున్నారు. దీంతో ఈ నెల 18వ తేదీ ఒక్కరోజే రూ.14.79 కోట్ల ఆదాయం సమకూరినట్లు సజ్జనార్ వెల్లడించారు. సోమవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సులు 36.3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు ఆయన తెలిపారు. పండుగల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు తెలంగాణ, ఏపీలతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ప్రయాణం సాగించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన ప్రజలకు సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు. కాగా పండుగకు ముందు ఈ నెల ఒకటో తారీఖు నుంచి 7వ తేదీ వరకు రోజువారీ సగటు ఆదాయం రూ. 9.70 కోట్లుగా ఉండగా.. పండుగ రోజుల్లో సగటున రోజువారీ ఆదాయం రూ. 10.17 కోట్లకు చేరింది. ఇక ఈ పది రోజుల్లో మొత్తం 2.80 కోట్ల మంది ప్రయాణికులను చేరవేశారు. ఆక్యుపెన్సీ రేషియో 63.19గా నమోదైంది.

స్పెషల్​ బస్సులతో రూ. 8 కోట్లు

తెలంగాణ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరగా.. ప్రత్యేక బస్సులతో రూ. 8 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే దసరా ప్రత్యేక బస్సుల ద్వారా ఐదుకోట్ల ఆదాయం రాబట్టాలని ముందుగా అధికారులు అంచనా వేశారు. కానీ అంచనా వేసిన దానికంటే రూ.3 కోట్లు అధికంగా వచ్చాయి.

చార్జీలు పెంచకపోవడంతోనే రద్దీ

గతంలో పండుగల సందర్భంగా నడిపించే ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేసేవారు. దీంతో చాలా మంది ప్రయాణికులు సొంత, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించేవారు. కానీ ఈసారి మాత్రం ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలనే వసూలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని అధికారులు ముందస్తుగానే ప్రకటించారు. అందుకే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తిరుగు ప్రయాణంలోనూ ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిటకటలాడుతున్నాయి.

అధిక ధరలపై కొరడా

మరోవైపు రాష్ట్రంలోని అన్ని బస్టాండ్‌లలో అధిక ధరలకు తినుబండారాలు విక్రయిస్తున్న దుకాణాలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణదారులకు సోమవారం నోటీసులు పంపారు. మరోవైపు ఉచిత మరుగుదొడ్ల వద్ద ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసిన వారికి కూడా జరిమానాలు విధించినట్లు సజ్జనార్ వెల్లడించారు. అధిక ధరల విషయంపై హైదరాబాద్ నగరంలోని జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్‌లలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

అందుబాటులోకి ఆన్​లైన్​ పేమెంట్​

ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ కొనే సమయంలో ఆన్‌లైన్ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేసేందుకు సిద్ధమైంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు నెటిజన్లు చేసిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్‌పై ప్రజలు మొగ్గు చూపుతుండటంతో ఆర్టీసీలోనూ ఇదే పద్ధతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ క్రమంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద మహాత్మా గాంధీ బస్ స్టేషన్ హైదరాబాద్, రెతిఫైల్ బస్ స్టేషన్(బస్ పాస్ కౌంటర్) సికింద్రాబాద్‌లో తీసుకొచ్చారు. ఈ సదుపాయం మంగళవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సజ్జనార్ ప్రకటనలో తెలిపారు. దీని వినియోగాన్ని కొన్ని రోజులు గమనించి, రాష్ట్రం మొత్తం ఈ సదుపాయాన్ని తీసుకొస్తామని తెలిపారు. అందువల్ల ప్రయాణికులు ఆన్‌లైన్ పేమెంట్స్ సదుపాయాన్ని వినియోగించి సక్సెస్ చేయాలని సజ్జనార్ కోరారు.

Advertisement

Next Story