తెలంగాణలో భారీ పెట్టుబడులు.. సింగపూర్ కంపెనీల ఆఫర్.!

by Shyam |
KTR-Singapore
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాలను సింగపూర్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో సహకారం అందజేస్తామని భారత్‌లోని సింగపూర్ హై కమిషనర్ సిమోన్ వాంగ్ అన్నారు. మంగళవారం ప్రగతి భవన్‌లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సింగపూర్ హై కమిషనర్ సమావేశమయ్యారు. హైదరాబాద్, తెలంగాణ గురించి మంత్రి వివరించారు. హైదరాబాద్ నగరం దేశంలోని ఇతర నగరాలకు భిన్నంగా కాస్మోపాలిటన్ స్వభావంతో అభివృద్ధి చెందుతూ వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అద్భుతమైన ప్రభుత్వ విధానాలతో పాటు, టీఎస్ ఐపాస్, సింగిల్ విండో అనుమతుల వంటి వాటితో అనేక అంతర్జాతీయ పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చామని హై కమిషనర్‌కు తెలిపారు. ఇక్కడ ఉన్న లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఐటీ, టెక్స్‌టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ వంటి పలు రంగాల్లో అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని వివరించారు.

సింగపూర్ హై కమిషనర్ సిమోన్ వాంగ్ మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన డీబీఎస్ వంటి కంపెనీలు, తమకు ఇక్కడ ఉన్న వాతావరణం గురించి సానుకూల ఫీడ్ బ్యాక్‌ను అందించాయన్నారు. సింగపూర్ కంపెనీలు ఐటీ, ఇన్నోవేషన్, ఐటీ అనుబంధ రంగాల్లోని బ్లాక్ చైన్ వంటి నూతన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చొరవ చూపిస్తున్నాయన్నారు. ఒకవైపు ఆధునిక రంగాల్లో పెట్టుబడులతో పాటు అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లోనూ సింగపూర్ కంపెనీలు ఇక్కడున్న అవకాశాలపై ఆసక్తితో ఉన్నాయని వెల్లడించారు.

మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సింగపూర్ కంపెనీలు ముందుకు వస్తే తెలంగాణలో ప్రత్యేకంగా ప్రత్యేక జోన్ లేదా సింగపూర్ హబ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అనంతరం హై కమిషనర్ సిమోన్ వాంగ్ పాటు, చెన్నైలో సింగపూర్ కౌన్సిల్ జనరల్ పొంగ్ కాక్ టియన్లను కేటీఆర్ సన్మానించారు.

Advertisement

Next Story

Most Viewed