నటుడు శివ బాలాజీ ఫిర్యాదుపై HRC స్పందన..

దిశ, వెబ్‌డెస్క్ :

మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ ఫీజు విషయంపై యాజమాన్యాన్ని ప్రశ్నించినందుకు గాను తమ పిల్లలను ఆన్‌లైన్ తరగతుల నుంచి బ్లాక్ చేయడంపై నటుడు శివబాలాజీ బుధవారం ఉదయం మానవ హక్కుల సంఘం (HRC)కి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన HRC సమగ్ర విచారణ జరిపి రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా DEOను ఆదేశించింది.

అయితే, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని శివబాలాజీ హెచ్ఆర్సీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆయన ఫిర్యాదు చేసిన రోజే పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఫీజుల పెంపుపై నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన 46జీవో ప్రకార కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా… ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు మాత్రం ఇతర ఫీజులు కూడా వసూలు చేస్తున్నాయని ఆరోపించారు.

శివ బాలాజీ HRCకి ఫిర్యాదు చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై రెండ్రోజుల కిందట శివ బాలాజీ భార్య మధు మాట్లాడుతూ… మౌంట్ లిటేరాలో చదువుతున్నవిద్యార్థుల తల్లితండ్రులంతా కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. అందులో తానూ ఒక సభ్యురాలినని చెప్పారు. అధిక స్కూల్ ఫీజులపై వాట్సాప్ గ్రూపులో విద్యార్థుల తల్లిదండ్రులందరం చర్చించామని… దానిపై స్కూల్ యాజమాన్యంతో మాట్లాడే బాధ్యతను తాను తీసుకున్నానన్నారు.

అయితే, స్కూల్ యాజమాన్యం మాత్రం అందరు విద్యార్థుల పేరెంట్స్ తరపున మీరెలా మాట్లాడుతారని… ఏదైనా మాట్లాడితే మీ వ్యక్తిగతంగా మాట్లాడాలని తనతో చెప్పినట్లు మధు వివరించారు. అప్పటినుంచి తమ పిల్లల ఆన్‌లైన్ క్లాసుల ఐడీలను బ్లాక్ చేసినట్లు చెప్పారు. ఇది ఒకరకంగా విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరింపులకు గురిచేయడమేనని ఆరోపించారు. ఇప్పుడీ వ్యవహారం HRC పరిధిలోకి వెళ్లడంతో నిబంధనలు ఉల్లంఘించిన స్కూళ్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.

Advertisement