లాక్‌డౌన్‌లో ఇంటర్నెట్ లేని వారి దుస్థితి ఇలా ఉంది!

by Shyam |
లాక్‌డౌన్‌లో ఇంటర్నెట్ లేని వారి దుస్థితి ఇలా ఉంది!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా గురించి అప్‌డేట్ తెలుసుకోవాలన్నా, ఆరోగ్యసేతు ఉపయోగించాలన్నా, ప్రభుత్వ సౌకర్యాలు పొందాలన్నా, ఆన్‌లైన్ క్లాస్ వినాలన్నా, చివరికి ఇంట్లో టైంపాస్ కావాలన్నా ఇంటర్నెట్ కావాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్నట్‌లేని వారి పరిస్థితి ఏంటి? ఇదే అనుమానం ప్రెంచి కంపెనీ కాప్జెమినీకి వచ్చింది. దీంతో మొత్తం ఆ దేశాల్లో 1300 మందిని సర్వే చేశారు. ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, స్వీడన్, బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్ దేశాల్లో 69 శాతం మంది ఇంటర్నెట్ పొందలేని పేదరికంలో బతుకుతున్నారని తేలింది. ఈరోజుల్లో ఇంటర్నెట్ అనేది అవసరమైన వస్తువే తప్ప విలాసం కాదని ఈ సర్వే చేయించిన కాప్జెమినీ సీవోవో అలిమన్ ఇజ్జత్ అభిప్రాయపడ్డారు.

కరోనాకు ముందు ప్రపంచంలో ప్రతి ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉందని యునైటెడ్ నేషన్స్ ఇంటర్నెట్ అండ్ టెలికామ్స్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ సదుపాయం అందుబాటులో లేనివారికి గతంలో కూడా ఉద్యోగావకాశాలు, ఇతర సదుపాయాలు అందకపోయేవి. ఇక లాక్‌డౌన్ కాలంలో పరిస్థితి దారుణంగా మారింది. మామూలు స్థితిలో ఉన్నట్లుగా ఇంటర్నెట్ కెఫేలు, ఫ్రీ వైఫై హాట్‌స్పాట్ల సౌకర్యం కూడా లేకపోవడంతో వారు చాలా ఇబ్బంది పడుతున్నారని ఈ సర్వే వెల్లడించింది. అలాగే ఇంటర్నెట్ లేని వారిలో 18 నుంచి 36 ఏళ్ల వయసున్నవారు 40 శాతం కంటే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. సాధారణంగా ఈ వయస్సు వారికే స్మార్ట్‌ఫోన్ తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఇంటర్నెట్ లేకపోవడం గురించి విచారిస్తే దాని కోసం పెట్టాల్సిన డబ్బును తాము ఇతర ముఖ్యమైన నిత్యావసర వస్తువు మీద ఖర్చు చేసినట్లు చెప్పారని సర్వేలో పేర్కొన్నారు. ఏదేమైనా లాక్‌డౌన్ సమయంలో ఇంటర్నెట్ ఒక కీలక పాత్ర పోషిస్తోందనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి ఇంటర్నెట్‌ని అత్యవసర వస్తువుగా పరిగణించి ఆయా దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కాప్జెమినీ సలహా ఇచ్చింది.

Tags: corona, covid, internet, arogya sethu, facilities, capgemini, hotspot, alima ezzat, wifi

Advertisement

Next Story