పని ప్రదేశంలో వేధింపులా?.. అరికట్టండి ఇలా!

by Shyam |   ( Updated:2021-08-25 23:22:59.0  )
పని ప్రదేశంలో వేధింపులా?.. అరికట్టండి ఇలా!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఉద్యోగులు ఇంట్లో కన్నా ఆఫీసులోనే అధిక సమయం గడుపుతుంటారు. అలాంటి ప్లేస్ పనిచేసుకునేందుకు ఉత్తమ ప్రదేశంగా ఉండాలే తప్ప వేధింపులకు నిలయంగా మారకూడదు. ఈ మేరకు కార్యాలయాల్లో ‘వేధింపు’ అనే పదం కేవలం ‘సెక్సువల్ హరాస్‌‌మెంట్’‌కే పరిమితం కాలేదు, అనేక రూపాల్లో ఉనికిని కలిగి ఉంది. ఆఫీస్ స్పేస్‌లో ఉద్యోగిని వేధించడం చట్టవిరుద్ధం కాగా, బాధిత వ్యక్తి.. సంబంధిత కంపెనీ లేదా సదరు వ్యక్తికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేయొచ్చు. ఈ నేపథ్యంలోనే ఎంతోమంది జాతి, రంగు, లింగం, మతం, వయస్సు, వైకల్యం, జాతీయ మూలం(నేషనల్ ఆరిజిన్) ఆధారంగా వేధింపులకు గురవుతున్నారు. అంతేకాదు హరాస్‌మెంట్ అనేది ఇన్-అప్రాప్రియేట్ కామెంట్స్, ఈమెయిల్స్, టెక్ట్స్ మెసేజెస్, చాట్స్, వీడియో కాల్స్ తదితర రూపంలోనూ ఉండొచ్చు. మరి వర్క్ ప్లేస్ హరాస్‌మెంట్‌‌ను ఎలా ఎదుర్కోవాలి? కంపెనీలు వారి ఉద్యోగులకు ఎలాంటి భద్రత కల్పించాలి? కంప్లయింట్ ఎలా ఫైల్ చేయాలి?.

సమాజంలో ప్రతీ చోట ఆడవాళ్లపై హరాస్‌మెంట్స్‌ జరుగుతూనే ఉండగా.. పని ప్రదేశాల్లో ఈ సమస్య వారిని తీవ్రంగా వెంటాడుతోంది. వర్క్‌ప్లేస్‌లో వేధింపు అనేది ఒక ఉద్యోగిని భయపెట్టే లేదా మనస్తాపం కలిగించే ప్రవర్తనగా చెప్పొచ్చు. పని వాతావరణాన్ని చెడగొట్టడంతో పాటు ఓ అమ్మాయికి స్వేచ్ఛ లేకుండా చేసే వేధింపులను అడ్డుకోవాల్సిన అవసరం అందరి బాధ్యతగా భావించాలి. అయితే శతాబ్దాలుగా లైంగిక, మానసిక వేధింపు‌లను మౌనంగా భరించిన మహిళలు.. ఇప్పుడిప్పుడే ‘మీ టూ’ పేరుతో ఉద్యమిస్తున్నారు. హరాస్‌మెంట్ చేస్తున్న వ్యక్తిపై తిరగబడుతున్నారు. అయినా ఈ జాడ్యానికి అంతం లేకుండా పోగా ఆఫీసుల్లో 50 శాతానికి పైగా మహిళలు ఏదో సందర్భంలో అసహ్యమైన కామెంట్స్, డబుల్ మీనింగ్ జోక్స్‌తో బాధపడుతున్నారని సర్వేల్లో తేలింది.

రేసియల్ హరాస్‌మెంట్స్

ఇది చర్మ రంగు ఆధారంగా ఉద్యోగి ఎదుర్కొంటున్న వేధింపు. అయితే ఇది వర్ణానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆచారాలు, నమ్మకాలు లేదా దుస్తుల ఆధారంగా వేధించడం కూడా ఇందులో భాగమే. రేసియల్ జోక్స్, జాతి అవమానాలతో పాటు కించపరిచే వ్యాఖ్యల రూపంలో ఈ దూషణలు ఉండవచ్చు. మతపరమైన, వైకల్యం ఆధారిత, వయస్సు ఆధారిత వేధింపులను లైంగిక ధోరణి‌గా పరిగణించొచ్చు.

వ్యక్తిగత వేధింపులు

ఈ రకమైన వేధింపులు కులం, రంగు, మతంపై ఆధారపడి ఉండవు. ఇవి అభ్యంతరకర వ్యంగ్యాస్త్రాలు, వ్యక్తిగత అవమానాలు, విమర్శనాత్మక వ్యాఖ్యలు, రెచ్చగొట్టే కామెంట్స్ రూపంలో ఉద్యోగిని వేధింపులకు గురిచేస్తారు. బుల్లీయింగ్ కూడా ఓ రకమైన హరాస్‌మెంటే.

శారీరక వేధింపులు

దీన్నే తరచుగా‘వర్క్‌ప్లేస్ వయొలెన్స్’ అని కూడా పిలుస్తారు. ఇది భౌతిక దాడులు లేదా బెదిరింపులతో కూడిన ఒక రకమైన పని వేధింపులను సూచిస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో, శారీరక వేధింపులను దాడిగా వర్గీకరించవచ్చు. ఉదాహరణకు: శారీరక దాడులు (కొట్టడం, నెట్టడం, తన్నడం), బెదిరింపు ప్రవర్తన (కోపంతో పిడికిలి చూపించడం), భయపెట్టడానికి ఆస్తిని నాశనం చేయడం వంటివి శారీరక వేధింపులుగా చెప్పొచ్చు.

మానసిక వేధింపులు

ఇది ఉద్యోగి ‘మానసిక ప్రశాంతత’పై దాడి లేదా ప్రతికూల ప్రభావాన్ని కలిగించే చర్యగా చెప్పొచ్చు. ఇది వారి సామాజిక జీవితాన్ని, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పని సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ పుకార్లు వ్యాప్తి చేయడం, వారిని తక్కువ చేయడం వంటి ఏ రూపంలోనైనా ఇది ఉండవచ్చు.

సైబర్ బెదిరింపు లేదా ఆన్‌లైన్ వేధింపులు

మెరుగైన వర్క్‌ఫ్లో సామర్థ్యం కోసం సంస్థలు సాంకేతికతను స్వీకరిస్తాయి. కానీ ఇది ఆన్‌లైన్ వేధింపుల‌కు దారి తీయొచ్చు. సోషల్ మీడియాలో అబద్ధాలు లేదా గాసిప్స్‌ను షేర్ చేయడం, ఇన్‌‌స్టంట్ మెసేజెస్‌లో అవమానకరమైన రీతిలో చాట్ చేయడం కూడా ఓ రకమైన వేధింపే.

క్విడ్ ప్రో కో హరాస్‌మెంట్

ఇది ఒక రకమైన మార్పిడి ఆధారిత లైంగిక వేధింపు. ఉద్యోగం ఆశ చూపి లేదా ఇంక్రిమెంట్, ప్రమోషన్ వంటి విషయాల్లో తరచుగా మేనేజర్ లేదా సీనియర్-లెవల్ ఉద్యోగి ఈ తరహా వేధింపులకు పాల్పడవచ్చు. ఇది బ్లాక్ మెయిల్‌కు మరో రూపం కూడా. ఉద్యోగికి ఏదో ఒక లైంగిక ప్రవర్తనలో పాల్గొనే షరతుపై ఉద్యోగ ప్రయోజనాలు అందిస్తే, దీనిని సాధారణంగా క్విడ్ ప్రో కో లైంగిక వేధింపుగా సూచిస్తారు.

పనిచేసే సంస్థ వెలుపల వ్యక్తుల నుంచి కూడా వేధింపులు ఎదురైతే దీన్ని థర్డ్ పార్టీ హరాస్‌మెంట్‌గా పరిగణించొచ్చు. మరి ఇలాంటి సమయంలో ఎంప్లాయిస్ ఏం చేయొచ్చు..

రికార్డ్ ..

అన్ని వేధింపు సంఘటనలను రికార్డ్ చేయడం అత్యుత్తమ పని. ఇందులో వేధిస్తున్న వ్యక్తి పేరు, కంపెనీలో వారి స్థానంతో పాటు ఎలాంటి వేధింపులకు పాల్పడుతున్నాడో నమోదు చేయాలి. సంఘటనకు సంబంధించిన సమయాలు, తేదీలు, ప్రదేశాలతో పాటు సాక్షుల వివరాలు నిర్ధిష్టంగా మెన్షన్ చేయాలి. సాధారణంగా, మీకు సాధ్యమైనంత ఎక్కువ సమాచారం, సాక్ష్యాలను సేకరించాలి. ఎందుకంటే ఇది మీ కేసుకు మరింత బలాన్ని అందిస్తుంది.

సాక్షులను పొందండి

మీ సహోద్యోగులతో మాట్లాడి.. సాక్ష్యాలను ధృవీకరించడం ద్వారా వారు మిమ్మల్ని బ్యాకప్ చేస్తారని నిర్ధారించుకోండి. మీరు వేధింపులకు గురవుతున్నట్లే, ఇతరులు కూడా వేధింపులకు గురయ్యే అవకాశం ఉంది. అలా అయితే ఒకరికొకరు జట్టుకట్టి సహాయం చేసుకోవాలి.

ప్రొఫెషనల్‌గా ఉండండి

తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, అహేతుకంగా ఏమీ చేయవద్దు. మీ ఆధారాలను సేకరించడానికి సమయం కేటాయించండి. మీ ఉన్నతాధికారి వద్దకు వెళ్లడానికి సరైన సమయం వచ్చినప్పుడు పక్కా ప్రూఫ్స్‌తో సదరు వ్యక్తిని పట్టించండి.

మీటింగ్

సూపర్‌వైజర్ లేదా హెచ్‌ఆర్‌తో సమావేశం ఏర్పాటు చేసుకుని మీకు జరిగిన సంఘటనలు, సాక్షుల రికార్డులను మీతో తీసుకెళ్లండి. ఒకవేళ.. వేధింపుదారుడు మీ సూపర్‌వైజర్‌గా ఉంటే, HR లేదా సూపర్‌వైజర్, ఉన్నతాధికారులను సంప్రదించండి. ఉన్నతాధికారులే అలా ప్రవర్తిస్తే, వారి మీదున్న అధికారులను లేదా పోలీసులను సంప్రదించాలి. ఫిర్యాదును పరిష్కరించే వరకు చర్యలు తీసుకునే వరకు పోరాడితేనే ఇతరులకు ఇలాంటి సంఘటనలు జరగకుండా, ఆఫీసులోనూ కఠిన నిర్ణయాలు అమలు చేసేలా నిబంధనలు రూపొందిస్తారు.

ఇలాంటి సాధారణ వేధింపు సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కార్యాలయ వేధింపు విధానాలను క్రమం తప్పకుండా సవరించడం, అప్‌డేట్ చేయడం సంస్థ యజమానులకు తప్పనిసరి. అలాగే సంస్థలో వేగవంతమైన, క్రియాశీల, అంతర్గత ఫిర్యాదు వ్యవస్థ.. ఉద్యోగులను సురక్షితంగా, సంతృప్తికరంగా పనిచేసేలా చేస్తుంది. వారికి మద్దతుగా యాజమాన్యం ఉందనే భావన అందిస్తుంది. అంతేకాదు సమర్థవంతమైన వేధింపుల నిరోధక విధానాన్ని అభివృద్ధి చేయడం మరింత ఆవశ్యకమని ప్రతీ కంపెనీ గుర్తుంచుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed