అంతరిక్షం నుంచి ఏనుగుల లెక్కింపు

by Shyam |
అంతరిక్షం నుంచి ఏనుగుల లెక్కింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆకాశంలో ఎగిరే విమానం నుంచి చూస్తేనే.. భూమ్మీద ఉన్న మనుషులంతా చీమల్లా కనిపిస్తారు. అలాంటిది అంతరిక్షం నుంచి జంతువులను చూస్తే ఎలా కనిపిస్తాయి? అసలు కనిపించే అవకాశం ఉందంటారా? ఏమో గానీ బ్రిటన్ శాస్త్రవేత్తలు స్పేస్ నుంచి జంతువులను లెక్కించే కొత్త సాంకేతికతను ఇటీవల పరీక్షించారు. మరి వాళ్లు ఎలా లెక్కించారు? అసలు దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఆఫ్రికన్ ఏనుగులతో పాటు వన్యప్రాణుల జాతులను లెక్కించడానికి, గుర్తించడానికి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ రీసెర్చ్ యూనిట్, మెషిన్ లెర్నింగ్ రీసెర్చ్ గ్రూప్ పరిశోధకుల బృందం హైరిజల్యూషన్ కలిగిన ఉపగ్రహ చిత్రాలతో పాటు, ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతను ఉపయోగించారు. దశాబ్ద కాలంగా ఏనుగులు తమ ఆవాసాలు కోల్పోవడం, పంటను కాపాడుకునేందుకు రైతులు ఏనుగుల్ని చంపడం, వేటగాళ్ల దాడి వంటి కారణాల వల్ల ఆఫ్రికన్ ఏనుగుల జనాభా క్షీణించింది. అందువల్ల ఓ ప్రాంతంలోని ఏనుగుల కచ్చితమైన జనాభా తెలుసుకోవడం చాలా ముఖ్యమని, అప్పుడే వాటిని కాపాడుకోవడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. దీని ద్వారా వన్యప్రాణుల అక్రమ రవాణా, అక్రమ వేటను అరికట్టవచ్చని చెబుతున్నారు. కేవలం ఏనుగులనే కాకుండా మిగతా జంతువులను లెక్కించడానికి ఈ సాంకేతికత సహకరిస్తుందని అంటున్నారు. ఒక ప్రాంతంలోని ఏనుగుల సంఖ్యను లెక్కించడానికి ఒకప్పుడు ఏరియల్ సర్వే చేసేవాళ్లు. అయితే దానివల్ల కచ్చితమైన ఫలితాలు రావు. ఎందుకంటే విమానంలో పరిశీలకులు అలసిపోయే అవకాశం ఉండటంతో పాటు, కొన్నిసార్లు పూర్ విజబిలిటీ ఆటంకం కలిగిస్తుంది. అంతేగాకుండా వైమానిక సర్వేలు ఖరీదైనవి, లాజిస్టిక్ పరంగా సవాళ్లతో కూడుకున్నవని నిపుణులు పేర్కొన్నారు.

కొత్త పద్ధతిని పరీక్షించడానికి దేశంలోని మూడో అతిపెద్ద ఉద్యానవనంతో పాటు, ఏనుగుల సాంద్రత అధికంగా కలిగిన దక్షిణాఫ్రికాలోని అడో ఎలిఫెంట్ నేషనల్ పార్కును పరిశోధకులు ఎంచుకున్నారు. ఏనుగులను పర్యవేక్షించడానికి, లెక్కించడానికి ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించగా, ఉపగ్రహ చిత్రాల పరిశీలన కోసం మెషిన్ లెర్నింగ్‌ టెక్నాలజీని ఉపయోగించారు. పలు రకాల ఏనుగులను మెషిన్ గుర్తుపట్టేలా కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను రూపొందించామని, దీని వల్ల ఉపగ్రహ చిత్రాల్లో కంటితో గుర్తించలేని చిన్న చిన్న విషయాలనూ సులువుగా తెలుసుకోవచ్చని పరిశోధకులు వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యధిక రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాల(వరల్డ్ వ్యూ 3)ను ఇందుకోసం ఉపయోగించారు. ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి ఏనుగుల ట్రాకింగ్ చేయడం ఇదే తొలిసారేం కాదు. 2002లో..స్మిత్సోనియన్ శాస్త్రవేత్తలు ఆసియా ఏనుగులను ఎలా సంరక్షించవచ్చో అర్థం చేసుకోవడానికి జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జిఐఎస్) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఆ సమయంలో శాస్త్రవేత్తలు మయన్మార్‌లోని ఆసియా ఏనుగులపై మొదటి ఉపగ్రహ-ట్రాకింగ్ ప్రాజెక్టును ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed