ఊరికి పోయేదెట్ల?

by Shyam |
ఊరికి పోయేదెట్ల?
X

దిశ, మహబూబ్‌నగర్: కోవిడ్-19 కట్టడికి కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశమంతటా ఉపాధి పనులు కరువయ్యాయి. జిల్లా నుంచి హైదరాబాద్, కర్నాటకలోని గుర్మిట్కల్, రాయచూర్, కర్నూల్ వెళ్లిన జిల్లా వాసులు తిరిగి జిల్లాలోని తమ సొంత ఊర్లకు పయనమయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే, లారీలు, కార్లు, లిఫ్టు ఏదో ఒక్కటి ఎక్కి జిల్లా కేంద్రాల వరకు చేరుకున్నారు. కాని అక్కడి నుంచి సొంతూరుకు వెళ్లేందుకు మార్గం లేక ఆపసోపాలు పడుతున్నారు.

జిల్లా నుంచి వలసలు అధికం..

పాలమూరు జిల్లా వాసులు పొట్టకూటి కోసం హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, తదితర ప్రాంతాలకు వెళ్లారు. కరోనా దెబ్బకు అక్కడ ఉపాధి పోవడంతో అక్కడేమీ పనులు లేకపోవడంతో సొంత గ్రామాలకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. వచ్చే వాహనాలను మధ్యలోనే ఆపేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను అనుమతించబోమని చెబుతున్నారు. దీంతో జిల్లా వాసులు మార్గమధ్యలోనే దిగి నడుచుకుంటూ కిలోమీటర్ల కొద్ది దూరం వెళ్తున్నారు.
నియోజకవర్గ కేంద్రాలకు చేరుకునే వారు చాలా మంది అక్కడి నుండి గ్రామాలకు చేరుకునే అవకాశాలు లేకపోవడంతో..జిల్లా కేంద్రం వైపుగా నడక సాగిస్తున్నారు. ఒక వైపు పిల్లలు, మరో వైపు మూట ముల్లెలు నెత్తిన పెట్టుకుని విపరీతంగా ఎండ కొడుతున్నా అవస్థలు పడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. హైదరాబాద్, కర్ణాటకలోని గుర్మిట్కల్, రాయచూర్, కర్నూల్ వైపు నుంచి సుమారు వంద కిలోమీటర్ల పయనం కాలినడకన సాగిస్తున్నారు. మార్గమధ్యంలో ఎక్కడైనా తాగేందుకు నీరు, తిండి దొరకుతుందా అని ఎదురుచూస్తూ ఉసూరుమంటున్నారు. ఉపాధి కోల్పోయి ఇంటి బాట పట్టిన తమ లాంటి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.

Tags: lockdown effect, corona virus (covid-19)

Advertisement

Next Story

Most Viewed