- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘స్పైస్ గర్ల్స్ ఆఫ్ ఇండియా’ : ఏడుగురు కూతుర్లతో ఓ తల్లి బిజినెస్ జర్నీ
దిశ, ఫీచర్స్ : పోపుల పెట్టెలోని ప్రతి ద్రవ్యమూ అద్భుతమే! భారతీయ భూభాగంలో పండిన ప్రతీ సుగంధం ఔషధ భరితమే! వంటిట్లో వేసిన తాళింపు వీధంతా గుభాళిస్తుంది. భాగ్యనగరంలోని బిర్యానీ ప్రపంచ వేదికలపై సువాసనలు వెదజల్లుతుంది. చాయ్‌లో మునకలేసే యాలకులు, అల్లం ముక్కల రుచికి విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. పిజ్జా.. ఇటలీ నుంచి వచ్చినా దానిపై చల్లే ఇండియన్ ఒరేగానో, థైమ్ ద్రవ్యాలే(ఇండియన్ స్పైసెస్) టేస్ట్‌ను పెంచుతాయి. బిర్యానీ ఆకు పరిమళం, సోంపు తియ్యదనం, లవంగాలు, మిరియాల ఘాటు ఒక్కటేమిటి వేటికవే ప్రత్యేకమైనవి. అయితే ఆంగ్లేయులకు ముందు నుంచే ఇండియన్ స్పైసెస్‌ను విదేశీయులు ఎక్కువ ఇష్టపడేవారు. అంతటి చరిత్ర కలిగిన మసాలాలను జోధ్‌పూర్ మహారాజుల కాలం నుంచి అమ్ముతూ ఈరోజు ‘స్పైస్ గర్ల్స్ ఆఫ్ ఇండియా’గా పేరు తెచ్చుకుంది ఓ ఫ్యామిలీ. పురుషాధిక్యత కలిగిన ఈ సమాజంలో స్టీరియోటైప్స్ బ్రేక్ చేసి తన ఏడుగురు కూతుళ్లతో ఓ తల్లి సాగించిన ప్రయాణం, చేసిన వ్యాపారం ఎందరో మహిళామణుల్లో స్ఫూర్తినింపే స్పెషల్ స్టోరీ..
‘సన్ సిటీ’గా పేరొందిన నగరం జోధ్‌పూర్. ఈ ఒయాసిస్ నగరంలోని సర్దార్ మార్కెట్ ఎప్పుడూ పర్యాటకులతో సందడిగా ఉంటుంది. ఆ ప్రాంతంలోని ‘ఎంవీ స్పైసెస్ స్టోర్’ కూడా ఇంచుమించు ఓ చిన్నపాటి పర్యాటక ప్రాంతమే. ప్రపంచం నలుమూలల నుండి నగరాన్ని సందర్శించే పర్యాటకులు ఆ బ్రాండ్ మసాలాలు ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. ఇక వారి ట్రేడ్‌మార్క్ మసాలలతో తయారుచేసిన చాయ్ రుచికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. బ్రాండ్‌గా మారిన ఎంవీ స్పైసెస్ స్టోర్ వెనక ఓ తల్లి చేసిన పోరాటముంది. స్త్రీ స్వాతంత్ర్యం, సమానత్వం కోసం ఓ మహిళా చేసిన యుద్ధగాథ ఉంది. తనకు మాత్రమే కాదు ఆమె ఏడుగురు కుమార్తెలకు కూడా సమాజంలో గౌరవం దక్కాలనే ఆశయంతో సాగించిన ప్రయాణముంది. భర్త లేకపోయినా ఒంటరి మహిళగా సమాజ సవాళ్లను దాటి ‘ఎంవీ స్పైసెస్’కు పేరు తెచ్చిపెట్టిన ఘనత ‘భగవంతి మోహన్‌లాల్’ది. తన భర్త కన్నుమూసినప్పుడు.. కష్టాల్లో ఉన్న ఫ్యామిలీని ఆదుకోవడానికి తమ మసాలా బిజినెస్ కొనసాగించేందుకు సిద్ధపడగా, కొడుకు లేని కారణంగా వద్దని వారించింది భగవంతి అత్త. కానీ భగవంతి అత్త మాటలనే కాదు, సమాజ కట్టుబాట్లను కూడా పక్కనపెట్టి తన పనిని విజయవంతంగా కొనసాగించింది.
అజ్మీర్ టు జోధ్‌పూర్..
అజ్మీర్‌లో పెరిగిన భగవంతి, ఉన్నత విద్యను అభ్యసించి, మంచి ఉద్యోగం చేయాలని భావించింది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె చదువును అర్దాంతరంగా ఆపేసి, 22 ఏళ్ల వయసులో జోధ్‌పూర్‌కు చెందిన మోహన్‌లాల్‌తో వివాహం చేశారు. వారికి వరుసగా ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో అత్తమామలు చివాట్లు పెట్టారు. భగవంతి భర్త కుటుంబంతో కలిసి ఉండేందుకు, సామరస్యంగా జీవించడానికి చాలాసార్లు ప్రయత్నించి విఫలం కావడంతో ఇంటి నుంచి బయటకు వచ్చారు. కిరాణా దుకాణం పెట్టుకుని కొత్త జీవితం ప్రారంభించారు. అయితే భగవంతి వంటల్లోని ప్రత్యేకతను గమనించిన మోహన్‌లాల్, ఆమె ఉపయోగించే మసాలా గురించి తెలుసుకున్నాడు. ఇద్దరూ కలిసి స్పెషల్ స్పైసెస్ తయారుచేశారు. ఆ సుగంధ ద్రవ్యాలను మెహరంగర్ కోట సమీపంలో విక్రయించడం మొదలుపెట్టాడు మోహన్ లాల్. వ్యాపారం బాగానే కొనసాగుతున్న క్రమంలో, ఒక రోజు కోట గార్డు అతడి దగ్గరకు వచ్చి జోధ్‌పూర్ మహారాజా మిమ్మల్ని రమ్మంటున్నాడని చెప్పాడు. దాంతో అతడు భయంతో వణికిపోయాడు. కానీ రాజు ఓ శుభవార్త చెప్పాడు.
మోహన్‌లాల్ దగ్గర స్పెసెస్ కొన్న ఓ ఫ్రెంచ్ పర్యాటకుడు వాటిని ఎంతో ఇష్టపడి, ఆ విషయం తెలుపుతూ రాజుకు ఓ లేఖ రాశాడు. దాంతో రాజు మోహన్‌ను నగరానికి కీర్తిని తీసుకొచ్చారని, తనను అభినందించాడు. అంతేకాదు మెహరంగర్ కోటలో 6 వేల రూపాయలకు అద్దెకు స్థలం కూడా ఇవ్వడం విశేషం. రోజంతా మసాలాలు అమ్మే అతడు, సాయంత్రం రెండు గంటల పాటు స్పానిష్, ఫ్రెంచ్ వివిధ భాషలను నేర్చుకుంటూ పర్యాటకులతో సంభాషించేవాడు. అలాగే వ్యాపారం తొందరగా అభివృద్ధి చెందడంతో ఇంగ్లాండ్ కర్రీ ఆర్గనైజేషన్ కూడా భారతీయ సుగంధ ద్రవ్యాలను ధృవీకరించడంతో విదేశీ పర్యాటకులు వాటిని కొనేందుకు ఆసక్తి కనబరిచారు.
విజన్ టు కంటిన్యూ..
వ్యాపారం అభివృద్ధి చెందుతున్న క్రమంలో నా భర్త మరణించాడు. దు:ఖాన్ని దిగమింగుకుని ఏడుగురు కూతుళ్ల బాధ్యతతో పాటు, వ్యాపారం కూడా చూసుకోవాల్సి వచ్చింది. కానీ మా అత్తగారు నెలవారీ అద్దెకు బదులుగా దుకాణాన్ని తమకు ఇవ్వమని వేధించడం మొదలుపెట్టింది. వ్యాపారం నిర్వహిస్తానని చెప్పడంతో వాళ్లంతా కోపోద్రిక్తులయ్యారు. మార్కెట్లో కూర్చోవడం, నా కుమార్తెలను అక్కడ కూర్చోబెట్టడం గురించి నానారకాలుగా సిగ్గులేదంటూ, కుటుంబం పరువు తీస్తున్నానంటూ అనేక మాటలన్నారు. అయినా అవహేళనలన్నీ పక్కనపెట్టి వ్యాపారానికి, బిడ్డలకు ప్రాధాన్యతనిస్తూ పనిని కొనసాగించాను. ఏడుగురు కుమార్తెలకు రాజీలేకుండా చదువు చెప్పించాను. తండ్రి బాటలో అందరూ అనేక విదేశీ భాషల్లో ప్రావీణ్యం పొందారు. ఇప్పుడు బిజినెస్‌లో తండ్రిని మించిన కూతుళ్లుగా ముందుకు సాగుతున్నారు.
ఏడుగురు కుమార్తెలు (ఉషా, పూనమ్, నీలం, నిక్కి, కవిత, రితు, ప్రియ) ఎంవీ స్పైసెస్ నడుపుతున్నారు. జోధ్‌పూర్ నగరమంతటా నాలుగు బ్రాంచ్‌లున్నాయి. పండుగలకు ప్రత్యేకమైన ప్యాక్‌లు అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. తమ వెబ్‌సైట్ ద్వారా విదేశీ వినియోగదారులకు స్పైసెస్ అందిస్తున్నారు. అంతేకాదు విదేశీయులకు కుకరీ క్లాసులు కూడా నిర్వహిస్తుండటం విశేషం.