కరోనా ప్రభావంతో తగ్గిన ఇళ్ల అమ్మకాలు!

by Harish |
కరోనా ప్రభావంతో తగ్గిన ఇళ్ల అమ్మకాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 ప్రభావంతో దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది దాదాపు సగం క్షీణతను నమోదు చేసే అవకాశాలున్నాయని ప్రముఖ రేటింగ్ సంస్థ ఇక్రా అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో గృహాల అమ్మకాలు కొంతమేరకు పుంజుకున్నప్పటికీ.. దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పూణె నగరాల్లో గృహ విక్రయాలు తగ్గాయి. సాధారణ స్థాయికి చేరుకునేందుకు మరికొంత సమయం పడుతుందని ఇక్రా తెలిపింది. ప్రస్తుత ఏడాది రెండో సగంలో రికవరీ ఉండొచ్చని, అయితే, వార్షిక ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయనికి అమ్మకాల్లో 35-40 శాతం క్షీణత నమోదవచ్చని ఇక్రా ఓ ప్రకటనలో తెలిపింది.

సెప్టెంబర్ త్రైమాసికంలో అమ్మకాల వృద్ధి ఎక్కువగా బడ్జెట్ స్థాయిలో పెరుగుదలను సాధించినట్టు ఇక్రా పేర్కొంది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా రియల్ ఎస్టేట్ రంగం రికార్డు స్థాయిలో పతనమైంది. సెప్టెంబర్ త్రైమాసికానికి రెసిడెన్షియల్ విభాగంలో కొంత కోలుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద గృహాల అమ్మకాలు పరిమాణం దేశంలోని ప్రధాన నగరాల్లో 50 శాతం క్షీణతను నమోదు చేశాయి. ఇటీవల ఆర్థికవ్యవస్థ పునఃప్రారంభమవడం, గృహ రుణాల రేటు తగ్గింపులు, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, పథకాలతో రానున్న రోజుల్లో ఈ రంగం వృద్ధి కరోనాకు ముందునాటి స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని ఇక్రా వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed