చిగురిస్తున్న ఆశలు.. పెద్దపల్లిలో ఎయిర్‌పోర్టు!

by Sridhar Babu |
చిగురిస్తున్న ఆశలు.. పెద్దపల్లిలో ఎయిర్‌పోర్టు!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లాలోని బసంత్ఎయిర్ పోర్టు ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. నిర్మాణానికి సంబంధించిన సమగ్ర వివరాలు పంపించాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ కోరింది. దీంతో ఆయా ఎయిర్ పోర్టు ప్రాంతాలపై అధికారులు నివేదిక తయారు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎయిర్ పోర్టు కూడా ప్రతిపాదనల్లో ఉండడంతో మరోసారి స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

త్వరలోనే పనులు!

బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీకి అనుసంధానంగా ఉన్న బసంత్‎నగర్ ఎయిర్ పోర్టును డెవలప్ చేయాలన్న ప్రతిపాదనలు చాలాకాలంగా సాగుతున్నాయి. దీనికి సమీపంలోనే రెల్వే స్టేషన్ కూడా ఉండడంతో పాటు హైవే కూడా ఉండడంతో బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం మినీ ఎయిర్ పోర్టుగా తయారు చేసుకుని వినియోగించుకుంటోంది.

దీంతో ఇప్పుడున్న స్థలానికి మరింత భూమిని సేకరించి విస్తరిస్తే ఎయిర్ పోర్ట్ ఏర్పాటు కానుందని ఆశిస్తున్నారు. తాజాగా ఆర్‌అండ్‌బీ అధికారులు హై ఫ్లడ్ లెవల్ వివరాలను కూడా పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో త్వరలోనే ఇక్కడ ఎయిర్ పోర్ట్ ఏర్పాటు అవుతుందన్న ఆశలు మరోసారి రేకెత్తిస్తున్నాయి.

ఆచరణ సాధ్యమేనా?

అయితే బసంత్‎నగర్ వద్ద ఉన్న ఎయిర్ పోర్టును విస్తరించి అప్ గ్రేడ్ చేయడానికి ప్రతిపాదనలు తయారవుతున్నా ఆచరణలో సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రాంతం మీదుగా విద్యుత్ హై టెన్షన్ వైర్లు వెళ్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

ఈ ఎయిర్ పోర్టు సమీపంలోని ఎన్‌టీపీసీ నుంచి వివిధ ప్రాంతాలకు కరెంట్ సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా హై టెన్షన్ లైన్లు ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తే సాంకేతిక సమస్యలు ఎదురవుతాయని ఆలోచిస్తున్నారని సమాచారం. అధికారులు వీటికి ప్రత్యామ్నాయంగా లైన్లు వేస్తే విమానాశ్రయం ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed